నామినేషన్ పేరుతో మున్సిపాలిటీలో వసూళ్ల రగడ!
నో డ్యూ సర్టిఫికెట్ పేరుతో అభ్యర్థులకు ఇబ్బందులు
కల్వకుర్తి, జనవరి 29 (మనఊరు ప్రతినిధి): కల్వకుర్తి మున్సిపాలిటీలో నామినేషన్ పత్రాల స్వీకరణ సందర్భంగా అనవసరమైన షరతులు విధిస్తున్నారని అభ్యర్థులు మండిపడుతున్నారు. మున్సిపల్ ఎన్నికల నామినేషన్‌కు సంబంధించి ఎలాంటి నిబంధనలు లేకపోయినా, ఇంటి పన్ను, నీటి పన్ను బకాయిలు చెల్లించాల్సిందేనంటూ నో డ్యూ సర్టిఫికెట్ కోరడం అన్యాయమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. జనవరి 28 నుంచి నామినేషన్లు స్వీకరిస్తున్న మున్సిపాలిటీ కార్యాలయంలో, అవసరమైన అన్ని పత్రాలతో వచ్చిన అభ్యర్థులను పన్నుల పేరిట ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. రాజ్యాంగం కల్పించిన హక్కును వినియోగించుకోవడానికి వచ్చిన అభ్యర్థులపై ఈ విధమైన ఒత్తిడి తగదని వారు స్పష్టం చేశారు. ఈ వసూళ్లకు ప్రభుత్వం గానీ, జిల్లా కలెక్టర్ గానీ అనుమతి ఇచ్చారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల నియమావళి ప్రకారం ఎలాంటి అదనపు షరతులు లేకుండా నామినేషన్లు స్వీకరించాలని, ఈ అంశంపై జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే స్పందించి తక్షణమే చర్యలు తీసుకోవాలని అభ్యర్థులు మీడియా ద్వారా కోరారు.

