నిరుపేదల స్వయం ఉపాధికి ఫౌండేషన్ల కృషి అభినందనీయం

 నిరుపేదల స్వయం ఉపాధికి ఫౌండేషన్ల కృషి అభినందనీయం

కుట్టు మిషన్లు, తోపుడు బండ్లు, ట్రై సైకిళ్ల పంపిణీకి ఎమ్మెల్యే ప్రశంసలు

తలకొండపల్లి, జనవరి 28 (మన ఊరు ప్రతినిధి): నిరుపేదలు స్వయం ఉపాధితో ఆర్థికంగా నిలదొక్కుకోవాలనే లక్ష్యంతో చేతన ఫౌండేషన్, యూఎస్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో చేపడుతున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని కల్వకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండల కేంద్రంలోని దేవకి గార్డెన్స్‌లో చేతన ఫౌండేషన్ & యూఎస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 40 కుట్టు మిషన్లు, 12 తోపుడు బండ్లు, ఒక ట్రై సైకిల్ పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా చేతన ఫౌండేషన్ చైర్మన్ వేణిగాళ్ల రవికుమార్, యూఎస్ ఫౌండేషన్ చైర్మన్ ఎర్ర శ్రీనివాస్ రెడ్డి నిరుపేదల కోసం చేపడుతున్న సేవా కార్యక్రమాలు ప్రశంసనీయమని పేర్కొన్నారు. భవిష్యత్తులో కల్వకుర్తి నియోజకవర్గంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి కార్యక్రమాలు మరింత విస్తృతంగా నిర్వహించేందుకు తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. మంచి కార్యక్రమాలు చేసే సంస్థలకు ప్రభుత్వం, ప్రజాప్రతినిధులుగా నిరంతరం సహకారం అందిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా చేతన ఫౌండేషన్ చైర్మన్ వేణిగాళ్ల రవికుమార్ మాట్లాడుతూ నిరుపేద విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు, అనాథాశ్రమాల్లో అన్నదాన కార్యక్రమాలు, నిరుపేదలకు కుట్టు మిషన్లు, తోపుడు బండ్ల పంపిణీ వంటి సేవా కార్యక్రమాలను ఫౌండేషన్ ద్వారా నిరంతరం నిర్వహిస్తూ పేదలకు అండగా నిలుస్తున్నామని తెలిపారు. యూఎస్ ఫౌండేషన్ చైర్మన్ ఎర్ర శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యంగా పాఠశాలలు, కళాశాలల్లో పెయింటింగ్ పనులు, స్పోర్ట్స్ మెటీరియల్, సైన్స్ ల్యాబ్ పరికరాలు, వాటర్ ఫిల్టర్లు అందిస్తున్నామని చెప్పారు. అలాగే నిరుపేదలు, వికలాంగులకు అండగా ఉండాలనే ఉద్దేశంతో చేతన ఫౌండేషన్‌తో కలిసి కుట్టు మిషన్లు, తోపుడు బండ్లు, ట్రై సైకిళ్ల పంపిణీ చేపట్టామని, త్వరలో వికలాంగుల కోసం మరిన్ని కార్యక్రమాలు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ కార్యదర్శి, మాజీ సర్పంచ్ బండి రఘుపతి, సీతారామయ్య, సురేష్, యార్లగడ్డ వెంకటరమణ, తలకొండపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డోకూర్ ప్రభాకర్ రెడ్డి, పీసీసీ సభ్యుడు ఆయిల్ శ్రీనివాస్ గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు యట నరసింహ, పీఏసీఎస్ చైర్మన్ గట్ల కేశవరెడ్డి, సభ్యులు శ్రీరామ్, రమేష్, యాదగిరి, మూడవత్ శివ, లక్సయ్య, వివిధ గ్రామాల సర్పంచులు, ఉపసర్పంచులు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.










Previous Post Next Post