సహకార బ్యాంకుల లో అక్రమాలు జరగకుండా చూడండి
అవినీతికి పాల్పడిన వారి ఆస్తులు జప్తు చేయండి
-అధికారులతో రాష్ట్ర సహకార శాఖ కమిషనర్ సురేంద్రమోహన్
మహబూబ్ నగర్, మార్చి 6 (మనఊరు న్యూస్): అవినీతి అక్రమలకు పాల్పడిన బ్యాంకు సిబ్బంది ఆస్తులను దప్తు చేసి రికవరీ చేయాలని రాష్ట్ర సహకార శాఖ కమిషనర్ సురేంద్రమోహన్ అన్నారు. బుధవారం రాత్రి జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని మినీ సమావేశ మందిరంలో జిల్లా కేంద్ర సహకార బ్యాంకు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పి.ఏ.సి.ఎస్) యాసంగి ధాన్యం సేకరణ కార్యచరణ ప్రణాళిక పై కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో సహకార సంఘాలను బలోపేతం చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను రాష్ట్ర సహకార శాఖ కమిషనర్ సురేంద్రమోహన్ ఆదేశించారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు బ్రాంచీలలో నిధులు దుర్వినియోగం జరిగినట్లు తెలిసిన వెంటనే రికవరీకి చర్యలు తీసుకొని, ఇందులో ఉన్న వారి పై ప్రణాళిక ప్రకారం ముందుకు సాగాలని ఆదేశించారు. జిల్లాలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పనితీరును ఆయన సమీక్షించారు. తక్కువ గ్రేడింగ్ లో ఉన్న వాటిని ఉన్నత గ్రేడింగ్ తీసుకువచ్చేందుకు జిల్లా సహకార అధికారి వెంటనే చర్యలు చేపట్టాలని ఆయన తెలిపారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ బ్యాంకులు ఎల్పిజి ఫిల్లింగ్ స్టేషన్, గోడౌన్ లు, జన ఔషధ కేంద్రాలు ఏర్పాటుకు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పిఏసిఎస్ గోదాం లు భారత ఆహార సంస్థ కు ధాన్యం నిల్వ కు ఇవ్వడానికి ప్రతిపాదనలు పంపించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి, రాష్ట్ర సహకార శాఖ అదనపు రిజిస్ట్రార్ శ్రీనివాసరావు,రెవెన్యూ అదనపు కలెక్టర్ మోహన్ రావు, జిల్లా సహకార అధికారి శంకరాచారి మార్కెటింగ్ శాఖ ఆర్.డి.డి. ప్రసాద్, జిల్లా మార్కెటింగ్ అధికారి బాలమణి తదితరులు పాల్గొన్నారు.