పొలం పనుల్లో విషాదం…
ట్రాక్టర్ కిందపడి యువ రైతు మృతి
ఊర్కొండ, జనవరి 8 (మనఊరు ప్రతినిధి): మండల పరిధిలోని మంధారం గ్రామంలో గురువారం విషాద ఘటన చోటుచేసుకుంది. పొలం పనుల కోసం వెళ్లిన శివయ్య (25) ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కిందపడి మృతి చెందాడు. పొలంలో దున్నుతుండగా ట్రాక్టర్ అదుపుతప్పి కిందపడటంతో శివయ్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు తెలిసింది. యువకుడు మృతదేహంగా ఇంటికి చేరడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై మృతుడి భార్య స్వాతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ కృష్ణదేవ తెలిపారు.

