*నన్ను ఆనందపర్చండి.. మీ కొంగు బంగారం చేస్తా
కన్నెర్ర చేస్తే రక్తం కక్కుకుంటారు
స్వర్ణలత భవిష్యవాణి
హైదరాబాద్, జులై 14: ఉజ్జయిని మహాంకాళి ఆలయంలో (సోమవారం) రంగం కార్యక్రమం ఘనంగా జరిగింది. బోనాలు పండుగ తర్వాత రోజు జరిగే రంగం కార్యక్రమంలో మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. అమ్మవారి పచ్చి కుండపై ఎదురుగా నిలబడి స్వర్ణలత భవిష్యవాణి చెప్పారు. ఈ యేడాది కూడా వర్షాలు బాగా కురుస్తాయని చెప్పారు. తాను కోపంగా లేనని.. తాను కన్నెర్ర చేస్తే రక్తం కక్కుకుంటారు అంటూ స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు.
బోనాలు సంతోషంగా అందుకుంటా..
'నా భక్తులు సమర్పించిన బోనాలను సంతోషంగా స్వీకరించాను. కానీ ప్రతీ యేడు ఏదో ఒక ఆటంకం చేస్తూనే ఉన్నారు. ప్రతీ యేడు చెప్పినట్లు నన్ను లెక్క చేయడం లేదు. ఏడాది ఏడాది నా కోరిక చెప్పినా నెరవేర్చడం లేదు. నా బిడ్డలను కడుపులో పెట్టుకుని కాపాడుకుంటున్నాను. నా పూజలన్నీ నాకు సక్రమంగా జరిపించాలి. నా కోపానికి మీరు బలి అవుతారు.. కానీ నాకు కోపం చూపించడం లేదు. నేను కన్నెర్ర చేస్తే మీరు రక్తం కక్కుని చస్తారు. కాలం తీరిందంటే ఎవ్వరు ఏది అనుభవించాలో అది తప్పక అనుభవిస్తారు. నేను దానికి అడ్డురాను. నాకు సక్రమంగా పూజలు చేసి.. నాకు రక్తం చూపించండి. ఈ యేడు జరిపించకపోతే.. ఎవరెవరు అడ్డుపడుతారో వారికి రక్తం కక్కేలా చేస్తా. అందుకు నన్ను నిందించొద్దు. నన్ను కొలిచే వారు తప్పనిసరిగా విధివిధానంగా పూజలు జరిపించండి' అని ఆజ్ఞాపించింది అమ్మవారు. అయితే తల్లీ కోపం వద్దు.. సక్రమంగా పూజలు చేసి ఆలయ పూజారులు అమ్మవారికి వాగ్దానం చేశారు.
రాబోయే రోజుల్లో..
'అందరికీ తోడుగా నిలబడతా.. అందరినీ కాపాడుతా. నా రాష్ట్రాన్ని కానీ.. దేశాన్ని కానీ కాపాడే బాధ్యత నాది. రాబోయే రోజుల్లో మహమ్మారి వెంటాడుతుంది. అందరూ జాగ్రత్తగా ఉండాలి. మీరు పాటించాల్సినవి పాటించండి. అగ్నిప్రమాదాలు జరుగుతాయి. ముందే హెచ్చరిస్తున్నా. ఈ ఏడు వర్షాలు తప్పకుండా కురుస్తాయి. పాడి పంటలను సమృద్ధిగా చూస్తే భారం నాది. భక్తుల ఐదు వారాలు పప్పు పలహారాలతో, కడివెడు సాక పోసి, పసుపు కుంకుమలతో నన్ను ఆనందపర్చండి. మీరు కోరిందల్లా కొంగు బంగారం చేసే మహంకాళిని నేను' అంటూ స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. అమ్మవారి ప్రతిరూపంలో మాతంగి స్వర్ణలత చెప్పే భవిష్యవాణి కోసం భక్తులు ఆలయానికి తరలివచ్చారు.
రంగం కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నారు. రంగం అనంతరం ఘనంగా అమ్మవారి అంబారి ఊరేగింపు జరుగనుంది. అలాగే సాయంత్రం పలమార బండ్ల ఊరేగింపు కార్యక్రమం నిర్వహించనున్నారు. ఊరేగింపు కోసం కర్ణాటక తుంకూరులోని శ్రీ కరిబసవ స్వామి మఠం నుంచి తెలంగాణకు 33ఏళ్ల ఆడ ఏనుగు లక్ష్మీని తీసుకొచ్చారు. సంబంధిత శాఖ చట్టాల ప్రకారం అన్ని జాగ్రత్తలతో ఈనెల 12వ తేదీన ఏనుగును అధికారులు తీసుకొచ్చారు.