అతివలకు ధీమా - రుణ భీమా

 అతివలకు ధీమా - రుణ భీమా

-ప్రమాద బీమా పథకం 2029 వరకు పొడిగింపు 

-అమలు బాధ్యత స్త్రీనిధికి

-ప్రమాదంలో మరణిస్తే 10 లక్షల పరిహారం 

-సహజంగా మరణిస్తే రుణ నిల్వ సంఘం పొదుపు ఖాతాకు జమ 





నాగర్ కర్నూల్, జూలై 12 (మనఊరు ప్రతినిధి): మహిళలు పొదుపు సంఘాలలో చేరి ప్రభుత్వం అందిస్తున్న రుణాలను సద్వినియోగం చేసుకొని వివిధ వ్యాపారాలలో తమ ప్రత్యేకతను చాటుతున్నారు. రుణాల ద్వారా ఆర్థిక చేయూతనందిస్తున్న ప్రభుత్వం పొదుపు సంఘాల లోని సభ్యులు మరణిస్తే ఆ రుణం సంఘానికి సభ్యులకి భారం కాకూడదన్న ఉద్దేశంతో గత ఆర్థిక సంవత్సరం నుంచి రుణ మరియు ప్రమాద బీమా పథకాలను ప్రవేశపెట్టింది. సభ్యులపై ఒక్క రూపాయి కూడా భారం మోపకుండా ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తూ ఈ బీమా పథకాలను అమలు చేస్తున్నది. దీంతో స్వయం సహాయక సంఘాలలో చేరే మహిళల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయింది. మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా అమలు చేస్తున్న బీమా పథకాలలో లోన్ బీమా పథకం కింద బ్యాంకులింకేజ్ ద్వారా రుణం తీసుకున్న సభ్యురాలు ఏదేని కారణం చేత మరణించినట్లయితే రుణ బకాయి నిల్వ ( గరిష్టంగా రెండు లక్షల వరకు )సంఘం పొదుపు ఖాతాలో జమ చేస్తుంది. ప్రమాద బీమా పథకంలో పొదుపు సంఘంలో సభ్యురాలు అయి ఉండి రుణం ఉన్న, లేకున్నా ప్రమాదవశాత్తు మరణించిన సభ్యురాలు కుటుంబ సభ్యులకు 10 లక్షల బీమాను ప్రభుత్వం అందిస్తుంది. ప్రస్తుతం జిల్లా పరిధిలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ పరిధిలో 619 గ్రామ సంఘాలలో 14669 సంఘాలలో 1,32021 మంది సభ్యులు , పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ పరిధిలో 79 స్లమ్ సమాఖ్యలలో 1995 సంఘాలలో 15960 మంది సభ్యులు ఉండగా వీరందరికీ ప్రమాద బీమా పథకాన్ని 2029 వరకు పొడిగిస్తూ దీని అమలను స్త్రీనిధి ద్వారా జరపాలని ప్రభుత్వం ఇటీవలే ఉత్తర్వులు జారీ చేసింది.

*అమలు తీరు ఇలా*

రుణ, ప్రమాద బీమాలను ప్రభుత్వం స్త్రీనిది , సెర్ప్, మెప్మా ద్వారా అమలుపరుస్తుంది. మరణించిన సభ్యురాలు వివరాలను సెర్ప్ ,మెప్మా అధికారులు ఆన్లైన్లో నమోదు చేసి సంఘం తీర్మానం, రుణ స్టేట్మెంట్లు తదితర డాక్యుమెంట్లను అప్లోడ్ చేస్తారు. అనంతరం వివిధ దశలలో స్త్రీనిది అధికారులు వాటిని పరిశీలించి బీమా మొత్తాలను సంఘం ఖాతా కు , నామినీ ఖాతాకు జమ చేస్తారు. గత ఆర్థిక సంవత్సరంలో ప్రమాద బీమా క్లెయిమ్ లు 16 నమోదు కాగా రుణబీమా క్లెయిమ్ లు 117 నమోదయ్యాయి .వీటిలో ఇప్పటివరకు రుణ బీమా 76 మంది సభ్యుల కుటుంబాలకు 44 లక్షల రూపాయలు ,ప్రమాద బీమా పథకం నుండి 11 మంది సభ్యుల కుటుంబాలకు ఒక కోటి పది లక్షల రూపాయలు మంజూరు అయ్యాయి.

*బీమా పథకాల అమలుకు పటిష్ట చర్యలు*

రుణ మరియు ప్రమాద బీమా పథకాలను పటిష్టంగా అమలుపరిచేందుకు ,నమోదు చేయబడిన అన్ని క్లెయిమ్ లను వేగంగా పరిష్కరించి సంఘం మరియు నామినీ ఖాతా కు క్లెయిమ్ మొత్తాన్ని జమ చేసేందుకు సెర్ప్ ,మెప్మా అధికారుల తో సమన్వయం చేసుకొని అన్ని చర్యలను చేపడుతున్నాం. పెండింగ్లో ఉన్న అన్ని క్లెయిమ్ లను వెంటనే మంజూరు అయ్యేవిధంగా చూస్తాము.

 *స్త్రీనిధి రీజినల్ మేనేజర్ జి. మహేంద్ర కుమార్*

*అవగాహన కల్పిస్తున్నాం*

ప్రభుత్వం అందిస్తున్న భీమా పథకాలు మరియు స్త్రీనిధి సురక్ష సంఘానికి, సభ్యులకు భరోసాను కల్పిస్తున్నారు. సెర్ఫ్ ,మెప్మా అధికారులతో కలిసి అన్ని గ్రామ సంఘాలలో అవగాహన సమావేశాలు నిర్వహిస్తున్నాము. ప్రభుత్వ నిర్ణయం కారణంగా జిల్లాలో కొత్త సభ్యులు మహిళా సంఘాల్లో చేరి రుణాలు పొందేందుకు అధికంగా ముందుకు వస్తున్నారు.

*స్త్రీనిది మేనేజర్ పి. విక్రమ్ కుమార్*

Previous Post Next Post