ప్రాదేశిక స్థానాల లెక్క తేలింది!.. రేపు అధికారికంగా ప్రకటించే అవకాశం
రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల లెక్క తేలింది. గ్రామ పంచాయతీలు, వార్డుల సంఖ్య కూడా బయటకొచ్చింది. గత ఎన్నికలతో పోలిస్తే రాష్ట్రంలో ఒక జిల్లా పరిషత్ (జడ్పీ) స్థానం తగ్గిపోయింది.
రెండురోజుల సెలవులతో తుది జాబితా ప్రకటించని పంచాయతీరాజ్ అధికారులు
తగ్గనున్న ఎంపీటీసీ స్థానాల సంఖ్య
పెరుగనున్న మండలాల సంఖ్య
హైదరాబాద్, జులై 13 (మనఊరు ప్రతినిధి): రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల లెక్క తేలింది. గ్రామ పంచాయతీలు, వార్డుల సంఖ్య కూడా బయటకొచ్చింది. గత ఎన్నికలతో పోలిస్తే రాష్ట్రంలో ఒక జిల్లా పరిషత్ (జడ్పీ) స్థానం తగ్గిపోయింది. అనేక గ్రామాలు, మండలాలు సమీప మున్సిపాలిటీల్లో విలీనం కావడంతో ఎంపీటీసీ స్థానాల సంఖ్య కూడా 40 నుంచి 50 స్థానాల వరకు తగ్గాయి. మరోవైపు కొత్త మండలాలు, గ్రామ పంచాయతీల సంఖ్య పెరిగింది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లను ఇప్పటికే అధికార యంత్రాంగం ముమ్మరం చేసింది. రాష్ట్రంలోని జిల్లాలు, మండలాలు, గ్రామాలు, వార్డులు, పురపాలికలు ఇలా అన్ని స్థానిక సంస్థల పరిధులను నిర్దేశించాలని గతంలోనే ఉత్తర్వులను జారీచేసింది. ఈ నెల 10-11 తేదీల్లో ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించి 12న (శనివారం) తుది జాబితా ప్రకటించాలని ప్రభుత్వం గడువు విధించింది. అయితే, రెండో శనివారం, ఆదివారం సెలవుదినాలు కావడంతో ఇచ్చిన గడువు వరకు ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల కచ్చితమైన సంఖ్యను అధికారులు అధికారికంగా వెల్లడించలేదు. 2019 నాటి ఎన్నికల సమయంలో ఉన్న జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలు, సమీప మున్సిపాలిటీలలో విలీనమైన మండలాలు, గ్రామాల సంఖ్యను బట్టి జాబితాలను అధికారులు సేకరించి ఉంచారు.
తగ్గనున్న 50 ఎంపీటీసీ స్థానాలు?
మేడ్చల్-మలాజిగిరి జిల్లాలోని అనేక గ్రామాలు సమీప మున్సిపాలిటీల్లో విలీనం కావడంతో మేడ్చల్ జిల్లా పరిషత్ కనుమరుగు కానున్నది. కొత్త మున్సిపాలిటీలు ఏర్పాటు చేయడం, కార్పొరేషన్లలో గ్రామాలు విలీనం కావడం వల్ల ఎంపీటీసీ స్థానాల సంఖ్య సుమారు 50 వరకు తగ్గనున్నది. 2019లో ఎంపీటీసీ స్థానాలు 5,847 ఉండగా, ప్రస్తుతానికి ఆ సంఖ్య 5,800 వరకు తగ్గవచ్చని అంచనా. రాష్ట్రంలో మండలాల సంఖ్య 539 నుంచి 566కు పెరిగింది.
2001 నాటి జనాభాను పరిగణనలోకి తీసుకోవడం, 3,000 మంది ఓటర్లకు ఒక ఎంపీటీసీ స్థానం ఉండటం, కొత్త గ్రామాలు పెరగడం వల్ల ఎంపీటీసీ స్థానాల సంఖ్య సుమారు 50 వరకు తగ్గుతున్నట్టు అధికారవర్గాల ద్వారా తెలిసింది. నాడు 12,769 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగగా, ఇప్పుడు వాటి సంఖ్య 12,777కు చేరింది. స్థానిక సంస్థలకు సంబంధించిన అన్ని అంశాలను సోమవారం అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నది.
2019లో ఎన్నికల నాటికి
జిల్లా పరిషత్‌లు : 32
మండల పరిషత్‌లు: 539
గ్రామ పంచాయతీలు: 12,769
గ్రామాల వార్డులు : 1,13,136
జడ్పీటీసీ స్థానాలు: 539
ఎంపీటీసీ స్థానాలు: 5,847
2025లో సుమారుగా
జిల్లా పరిషత్‌లు : 31
మండల పరిషత్‌లు: 566
గ్రామ పంచాయతీలు: 12,777
గ్రామాల వార్డులు: 1,12,700
జడ్పీటీసీ స్థానాలు : 566
ఎంపీటీసీ స్థానాలు: 5,800