అనిరుధ్ అర్థం పర్థం లేకుండా పిచ్చోడిలా వాగకు... నా సోదరి పేరుపై రెండెకరాలుంటే నిరూపించు..
చేతనైతే జడ్చర్ల నియోజకవర్గంలో రహదారి పనులు ఆంధ్రా, నెల్లూరు కాంట్రాక్టర్ల పనులు రద్దు చేసి బిల్లులు ఆపించు
ప్రతిపక్ష నేతలపై బురద చల్లడం, చిల్లర రాజకీయాలు చేయడం మానుకో...
- పోలేపల్లి కంపెనీల నుండి నా అకౌంట్ కు ఎన్ని డబ్బులు వచ్చాయో సాక్ష్యం చూపించు...
నీ సొంతూరు రంగారెడ్డిగూడలో 80ఎకరాల దేవాలయ భూముల కబ్జా చేసిందెవరు?...
- జడ్చర్ల మీడియా సమావేశంలో మాజీ మంత్రి లక్ష్మారెడ్డి*
జడ్చర్ల రూరల్, జూలై 10 (మనఊరు ప్రతినిధి): జడ్చర్లలో వింత రాజకీయాలు నడుస్తున్నాయని, కాంగ్రెసు ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అన్ని తొండి మాటలు, అబద్ధాలు చెబుతూ కాలం వెళ్లదీస్తున్నారని, గతంలో ఇలాంటి చిల్లర రాజకీయాలు ఎవరు చేయలేదని మాజీ మంత్రి డాక్టర్ సి. లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. జడ్చర్ల మండల కేంద్రంలోని సిగ్నల్ గడ్డ వద్ద మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యే జడ్చర్లకు వచ్చినప్పుడల్లా ప్రతిసారి ఏదో ఒక విషయంలో తనపై లేదా బిఆర్ఎస్ నాయకులపై ఆరోపణ చేయడం అన్ని తొండి మాటలు అబద్ధాలు చెప్పడం అలవాటు అయిపోయిందన్నారు. అనిరుద్ రెడ్డి ముందుగా తన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తన అక్క పేరుమీద రెండు ఎకరాల పొలం ఉన్నట్లు నిరూపించాలని, రంగారెడ్డిగూడెంలో ఉన్న ఎండోమెంటు ల్యాండ్ ఎటు పోయింది ఎవరు పేరుమీద ఉంది ఆ వివరాలు చెప్పాలని, పోలేపల్లి సెజ్ లోని కంపెనీల తన పేరు మీద ఉన్న ఏ అకౌంట్లో డబ్బులు పడ్డయో నిరూపించాలని, బాలానగర్ నుంచి గంగాపూర్ వరకు ప్రస్తుతం కొనసాగుతున్న రోడ్డు ను తానే మంజూరు చేయించినట్లు నిరూపించాలని, జడ్చర్ల మీదుగా వెళ్ళిన కోదాడ జాతీయ రహదారి విషయంలో పరిహారం ఎక్కడ ఇచ్చారో అది కూడా ప్రజలకు చెప్పాలని లక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు. అదేవిధంగా జడ్చర్ల లో బిఆర్ఎస్ నాయకుల ఇండ్లు కొనడం వల్ల 50 ఫీట్ల కంటే తక్కువ అయ్యేల రోడ్ల డివైడింగ్ చేశారని, ఆరోపించడంలో నిజం లేదని నిరూపించారు. సిగ్నల్ గడ్డ వద్ద బి ఆర్ ఎస్ నాయకుడు మన్నెం గోవర్ధన్ రెడ్డి ఇంటి నుంచి తానే స్వయంగా టేప్ సాయంతో కొలిచి 50 ఫీట్లకు పైగానే రోడ్డు విస్తరణ ఉందని నిరూపించారు. ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అమ్మ విషయంలో కూడా తాను ప్రోటోకాల్ విషయంలోనే మాట్లాడానని, జడ్చర్లలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనాలంటే ఇక్కడ మండల నాయకులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఉన్నారు కదా వారు పాల్గొని ఉంటే ఎలాంటి అభ్యంతరం లేదు అని తెలిపారు. ప్రస్తుతం జడ్చర్లలో ఎమ్మెల్యే తానా? అనిరుద్ రెడ్డి ఇంకా అర్థం కావడం లేదని లక్ష్మారెడ్డి చమత్కరించారు. తాను సిగ్నల్ గడ్డ నుంచి పాత బజారుకు బజార్ రోడ్డు ఉంది అని హెవీ వెహికల్స్ వెళ్తాయని అది డిజైన్ లోనే ఉంది అని నిరూపించడం జరిగిందని అదే విషయాన్ని అధికారులు సైతం ధ్రువీకరించిన విషయాన్ని గుర్తు చేశారు. బాధ్యత గల పదవిలో ఉండి జనాలను కన్ఫ్యూజ్ చేయడం ఎంతవరకు సమంజసమని, తిరిగి పదేపదే పాత బజారుకు రోడ్డు లేదు అని చెప్పడంలో ఎమ్మెల్యే ఆంతర్యం ఏమిటో తెలుపాలన్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే అనవసరపు, విషయాలు మాట్లాడొద్దని, బురదజల్లే ప్రయత్నాలు మానుకోవాలని చిల్లర రాజకీయాలు చేయొద్దని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో నాయకులు గోవర్ధన్ రెడ్డి, పిట్టల మురళి, సుదర్శన్ గౌడ్, పాలాది రామ్మోహన్, ప్రశాంత్ రెడ్డి, దేవా, ఉమాశంకర్ గౌడ్, నందకిషోర్ గౌడ్, రఘురాం గౌడ్, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.