విద్యారంగ సమస్యల పరిష్కారానికి ఎస్ఎఫ్ఐ జీపు యాత్ర..
బాలానగర్, ఆగస్టు 4 (మనఊరు ప్రతినిధి): విద్యారంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సోమవారం విద్యారంగ సమస్యల పరిష్కారానికి ఎస్ఎఫ్ఐ జీపు యాత్ర.. మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జీపు యాత్ర కార్యక్రమాన్ని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామెర కిరణ్ జెండాను ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ సమస్యల పరిష్కారం విషయంలో పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని ఆరోపించారు. కేజీ టు పీజీ వరకు రాష్ట్రంలోని విద్యార్థులకు ఉచిత విద్యను అందిస్తామని అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిది సంవత్సరాలు గడుస్తున్నా విద్యారంగంలో నెలకొని ఉన్న సమస్యలను పరిష్కరించడం లేదని అన్నారు. మహబూబ్ నగర్ జిల్లాలోగల విద్యాసంస్థల్లో కనీస వసతులు కూడా కరువయ్యాయని అన్నారు. జిల్లాలో కొత్తగా ప్రారంభించిన గురుకులాలకు ఇప్పటికి కూడా సొంత భవనాలు లేవని, అద్దె భవనాలలో అరకొర వసతులతో గురుకులాలు నడుస్తున్నాయని ఆయన అన్నారు. కాలేజీల హాస్టళ్ళ నిర్వహణకు కూడా సొంత భవనాలు లేవని లెక్చరర్లు, ఉపాధ్యాయులు, వార్డెన్లు కూడా లేరని, హాస్టళ్ళు సమస్యలకు నిలయాలుగా మారాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా వ్యాప్తంగా విద్యారంగంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై 17 మండల కేంద్రాలలో 5 రోజుల పాటు ఈ యాత్ర కొనసాగుతుందని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు గడుస్తున్న విద్యార్థులకు కనీసమైన మౌలిక వసతులు కల్పించకపోవడం సిగ్గుచేటు అని అన్నారు. 2019 నుంచి 2025 వరకు పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్, రియంబర్స్మెంట్ 8250 కోట్ల రూపాయలు బకాయిలో ఉన్నాయని అన్నారు. జిల్లా వ్యాప్తంగా 60శాతం గురుకులాను అద్దె భవనంలో నడుస్తున్నాయని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం కేజీబీవీలు 15 ఉండగా అందులో 5000 మంది విద్యార్థులపైగా విద్యను అభ్యాసిస్తున్నారని తెలిపారు. కానీ ఎక్కడ చూసినా కేజీబీవీలో సీసీ కెమెరాలు లేని పరిస్థితి ఉందన్నారు. అదే విధంగా ANM లు కూడా లేని పరిస్థితి ఉందన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేయాలని ప్రధానమైన డిమాండ్ తో ఈ యొక్క జీపు యాత్ర ముందుకు సాగుతుందని తెలిపారు. యాత్రలో వచ్చిన సమస్యలపై పెద్ద ఎత్తున రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ప్రశాంత్, కార్యదర్శి భరత్, ఉపాధ్యక్షులు నందు, శ్రీనాథ్, మండల అధ్యక్షులు అశోక్, ఎస్ఎఫ్ఐ నాయకులు ఈశ్వర్, హమీద్, జ్ఞాపిక, నవ్య, హేమలత, బన్నీ, సాయి, తదితరులు పాల్గొన్నారు.