చేపల ఆరోగ్య సంరక్షణపై ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలి
ముదిరాజ్ ఎంప్లాయిస్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు లోకేష్
నాగర్ కర్నూల్, ఆగస్టు 4 (మనఊరు ప్రతినిధి): చేపల ఆరోగ్య సంరక్షణపై ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలని ముదిరాజ్ ఎంప్లాయిస్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ (మెప) జిల్లా అధ్యక్షులు కొంకలి లోకేష్ అన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తూ ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేస్తున్నప్పటికీ జిల్లాలో ఆశించిన రీతిలో చేపల ఉత్పత్తి, ఉత్పాదకత ఆశించిన రీతిలో చేరుకోవడం లేదని, నీటి వనరులలో వదిలి పెట్టిన చేప పిల్లల ఆహార, ఆరోగ్య సంరక్షణకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల ఒక సమస్యగా మారిందన్నారు. అందువల్ల జిల్లాలో చేపల ఉత్పత్తి, ఉత్పాదకతలను పెంచేందుకు చేపల ఆరోగ్య సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ చూపించవలసి ఉన్నదన్నారు. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం మత్స్యశాఖలో చేపల ఆరోగ్య సంరక్షణకు సంబంధించి ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి ఉద్యోగ సిబ్బందిని నియమించాలని ప్రభుత్వాన్ని కోరారు.