బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారమే పాపన్న గౌడ్ ఆశయం..
జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
రాజాపూర్ ఆగస్టు 18 (మనఊరు ప్రతినిధి): బడుగు బలహీన వర్గాల ప్రజలకు రాజ్యాధికారం రావాలన్న ఆశయంతోనే సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆనాడు పోరాటం చేశాడని, ఆ పోరాటం మనందరికీ స్ఫూర్తిగా నిలవాలని ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి అన్నారు. సోమవారం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా రాజాపూర్ మండల కేంద్రంలోని ముఖ్య కూడలిలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి మాట్లాడుతూ.. 370 సంవత్సరాల క్రితమే బడుగు బలహీన వర్గాల బిడ్డ సర్వాయి పాపన్న గౌడ్ పోరాటం చేసి రాజ్యాధికారం సాధించాడని, ఆయన బాటలో నడవాలని కోరారు. కేవలం 12 మంది సహాయకులతో ప్రారంభమై, వేల మంది సైన్యాన్ని తయారు చేసుకొని, ఆయుధ సంపత్తితో గోల్కొండ కోటతో పాటు, తెలంగాణ ప్రాంతంలోని 32 కోటలను జయించి, బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారాన్ని అందించిన భారత దేశపు తొలి బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ వైఎస్ చైర్మన్ జవాజి శేఖర్ గౌడ్, మండల కేంద్రంతో పాటు మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన గౌడ కులస్తులు తదితరులు పాల్గొన్నారు.