*విద్యార్థులకు గుణాత్మకమైన విద్యను అందించాలి...*
జిల్లా విద్యాధికారి ప్రవీణ్ కుమార్
జడ్చర్ల, ఆగస్టు 21 (మనఊరు ప్రతినిధి): పట్టణంలోని జడ్పిహెచ్ఎస్ బాలుర బాదేపల్లి పాఠశాలలో గురువారం మండల స్థాయి టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ (టిఎల్ఎం) మేళాను జిల్లా విద్యాధికారి ప్రవీణ్ కుమార్ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు, ఉపాధ్యాయులు తరగతి గదుల్లో వివిధ రకాల బోధనా పరికరాలను (టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్) ఉపయోగించాల్సిన అవసరం ఉందని సూచించారు. విద్యార్థులు చదువుపై ఆసక్తి కనబరిచి, సృజనాత్మక ఆలోచనలను పెంపొందించుకోవడానికి టిఎల్ఎం ముఖ్యమైన సాధనమని వివరించారు. అలాగే, ఉపాధ్యాయులు తీసుకువచ్చిన వినూత్నమైన బోధనా పరికరాలను పరిశీలించి, వాటి ప్రాధాన్యతను విద్యా రంగంలో ఉపయోగాలను వివరించారు. టిఎల్ఎం ద్వారా క్లిష్టమైన పాఠాలను సులభతరం చేసి, విద్యార్థులకు చక్కగా అర్థమయ్యే విధంగా బోధించడం ఉపాధ్యాయుల ప్రధాన కర్తవ్యమని ఆయన అన్నారు. మేళాలో వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు తమ సృజనాత్మకతతో రూపొందించిన సైన్స్, గణితం, తెలుగు, ఇంగ్లీష్, సామాజిక శాస్త్రాల బోధన కోసం ప్రత్యేకమైన పరికరాలను ప్రదర్శించారు. వాటిని చూసి డిఇఓ సంతోషం వ్యక్తం చేసి, ప్రతిభావంతులైన ఉపాధ్యాయులను అభినందించారు. మున్సిపల్ చైర్ పర్సన్ పుష్పలత, బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ చైర్ పర్సన్ జ్యోతి, ఎఎంవో దుంకుడు శ్రీనివాసులు, ఎంఈవో కె.మంజులాదేవి, ఎంఎల్ఓ జగదీష్, పాఠశాలల హెచ్ఎంలు చంద్రకళ, లక్ష్మి, అనంతప్ప, మారేపల్లి శ్రీనివాసులు, యుగంధర్, వెంకటరెడ్డి, మల్లయ్య, ఉపాధ్యాయ సంఘం నాయకులు తాహేర్, సునీల్, గోవిందనాయక్, యుగంధర్ రెడ్డి, బాబునాయుడు, సుధాకర్ రెడ్డి, సురేంద్రనాథ్, శ్రీనివాస్, మధు, కారంగి కృష్ణ, సత్యం, రాజశేఖర్ రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
జిల్లా స్థాయికి ఎంపికైన ఉపాధ్యాయులకు ఎంఈవో మంజులదేవి సన్మానం
టిఎల్ఎం ముగింపు సమావేశంలో మండల విద్యాధికారి మంజుల దేవి నేతృత్యంలో మెరిట్ సర్టిఫికెట్ ఇస్తూ సత్కరించారు. జిల్లాకు ఎంపికైన ఎగ్జిబిట్స్ తెలుగు విభాగంలో ప్రథమ స్థానంలో మండలంలోని ప్రాథమిక పాఠశాల చర్లపల్లి, ద్వితీయ స్థానంలో ప్రాథమిక పాఠశాల గుటకడి తండా, ఇంగ్లీష్ విభాగంలో ప్రథమ స్థానంలో ప్రాథమిక పాఠశాల చిన్నపల్లి, ద్వితీయ స్థానంలో ప్రాథమిక పాఠశాల బాదేపల్లి (టీ), గణిత విభాగంలోప్రథమ స్థానంలో ప్రాథమిక పాఠశాల ఖానాపూర్, ద్వితీయ స్థానంలో కొత్త బజార్ ప్రాథమిక పాఠశాల ఈవిఎస్ ప్రథమ స్థానంలో ప్రాథమిక పాఠశాల రామస్వామి గుట్ట తండా, ద్వితీయ స్థానంలో ప్రాథమిక పాఠశాల కిష్టపల్లి జిల్లా స్థాయికి ఎంక కావడంతో ఉపాధ్యాయులను ఎంఈవో మంజులదేవి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.