అధికార లాంఛనాలతో ఆర్మీ జవాన్ అంత్యక్రియలు
రోడ్డు ప్రమాదంలో ఎక్స్ ఆర్మీమెన్ దుర్మరణం
కూచూరులో అలుముకున్న విషాద ఛాయలు
నవాబుపేట, ఆగస్టు 28 (మనఊరు ప్రతినిధి): అధికార లాంఛనాలతో ఆర్మీ జవాన్ అంత్యక్రియలు జరిగాయి. మండల పరిధిలోని కూచూర్ గ్రామానికి చెందిన ఎక్స్ ఆర్మీ మెన్ బసిరెడ్డి యాదగిరి (45) బుధవారం రాత్రి 11 గంటల సమయంలో మండల పరిధిలోని హన్మసానిపల్లి గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. బెంగళూరులో డిఫెన్స్ సెక్యూరిటీ ఫోర్స్ లో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తున్న యాదగిరి సెలవుపై సొంత గ్రామమైన కూచూరు కు వచ్చి బుధవారం వినాయకచవితి పర్వదినం కావడంతో తన బంధుమిత్రులతో కలిసి పర్వదిన వేడుకల్లో భాగంగా నిర్వహించిన పూజా కార్యక్రమాలలో పాల్గొని రాత్రి 10:00 గంటల సమయంలో తన ద్విచక్ర వాహనంపై మహబూబ్ నగర్ కు బయలుదేరాడు. మార్గమధ్యంలో హన్మసానిపల్లి గ్రామం దాటిన తర్వాత పోలీసోళ్ల గడ్డ దగ్గర వెళ్తుండగా మహబూబ్ నగర్ లో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించుకొని ఎదురుగా తన ద్విచక్ర వాహనంపై వచ్చిన అదే గ్రామానికి చెందిన కిందిగేరి సత్యం మోటార్ సైకిల్ ఆయన వాహనాన్ని బలంగా ఢీకొన్నది.ఆకస్మికంగా జరిగిన ప్రమాదంలో ఇరువురు తమ వాహనాలపై నుండి ఎగిరి క్రింద పడ్డారు. ఈ ప్రమాదంలో యాదగిరి అక్కడికక్కడే మృతి చెందగా సత్యం తీవ్ర గాయాల పాలయ్యాడు.
సుమారు 17 సంవత్సరాల సుదీర్ఘ కాలంగా దేశ రక్షణ కోసం ఆర్మీ జవాన్ గా 161 ఫీల్డ్ రెజిమెంట్ లో జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, లద్దాక్, సికింద్రాబాద్ లలో మృతుడు యాదగిరి విధులు నిర్వహించారు.17 సంవత్సరాలు దేశ రక్షణ కోసం ఆర్మీ జవాన్ గా విధులు నిర్వహించి పదవీ విరమణ పొందిన అనంతరం డిఫెన్స్ సెక్యూరిటీ ఫోర్స్ లో చేరిన ఆయన కేరళ రాష్ట్రంలోని కన్నూర్ లో శిక్షణ పొంది హైదారాబాద్ డి ఆర్ డి ఎల్, జమ్మూ కాశ్మీర్, విశాఖపట్నం,బెంగుళూర్ లలో విధులు నిర్వహించారు.మృతుడు యాదగిరికి భార్య లలిత, ఒక కుమారుడు,ఇద్దరు కుమార్తెలు కలరు. ఆయన మృతి వార్తతో సుమారు వంద మంది ఆర్మీ జవాన్లను దేశ రక్షణకు అందించిన మండల పరిధిలోని కూచూర్ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృత దేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం మహబూబ్ నగర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు.
పోస్ట్ మార్టం అనంతరం ఆయన భౌతిక కాయాన్ని కూచూరు గ్రామానికి తరలించి సాయత్రం అంత్యక్రియలు నిర్వహిస్తామని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ అదే గ్రామానికి చెందిన కిందిగేరి సత్యం పరిస్థితి విషమంగా ఉండటంతో జిల్లా ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్సల అనంతరం మెరుగైన చికిత్సల కోసం ఆయనను హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు.