బీసీలకు అవకాశాలు ఇచ్చేందుకు ఏ పార్టీ సిద్ధంగా లేదు: తీన్మార్ మల్లన్న*

 *బీసీలకు అవకాశాలు ఇచ్చేందుకు ఏ పార్టీ సిద్ధంగా లేదు: తీన్మార్ మల్లన్న* 

నిజామాబాద్, ఆగస్ట్ 17 (మనఊరు ప్రతినిధి): బీసీలకు రాజకీయ అవకాశాలు ఇవ్వడానికి ఏ పార్టీ సిద్ధంగా లేదని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న స్పష్టం చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్‌లోని 8 స్థానాల్లో బీసీ అభ్యర్థులను బరిలో దింపుతామని ఆయన ప్రకటించారు. ఆదివారం నిజామాబాద్‌లో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ నుంచి నిజామాబాద్ ఎంపీగా గెలుపొందిన కల్వకుంట్ల కవిత.. ఈ జిల్లాకు ఏం చేసిందని ప్రశ్నించారు. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో 25 లక్షల మంది బీసీ జనాభా ఉంటే.. వారిలో ఒక్క బీసీ వర్గానికి చెందిన వారు లేరని గుర్తు చేశారు. అయితే కామారెడ్డి నియోజక వర్గ ఎమ్మెల్యేగా ఉన్న ఏకైక బీసీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ అని.. ఆ ఒక్క బీసీ సీటును సైతం వెలమ దొర కేసీఆర్ లాక్కున్నారని మండిపడ్డారు.

ఉమ్మడి నిజామాబాద్‌లో ఏ రాజకీయ పార్టీ కూడా బీసీలకు అవకాశం ఇవ్వ లేదన్నారు. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఓడినా, గెలిచినా ఏడు సార్లు ఆయనకు అవకాశం ఇచ్చిందన్నారు. అయినా అక్కడ ఓసీ జనాభా ఎంత అంటూ ఈ సందర్భంగా ఆయన ప్రశ్నించారు. బీసీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ను ప్రతి ఎన్నికల్లో అసెంబ్లీ స్థానం మారుస్తూ ఆయనకు అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సమగ్ర కుల గణనలో ఓసీ జనాభా 15 శాతం అని తేలిందని.. సీఎం రేవంత్ రెడ్డి ఆ 15 శాతం తీసుకొని పక్కకు జరుగు అంటూ తీన్మార్ మల్లన్న వ్యంగ్యంగా అన్నారు.

తమకు 42 శాతం కాదు 60 శాతం రిజర్వేషన్లు కేటాయించాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. అలాగే కేబినెట్‌లో బీసీలకు 9 మంత్రి స్థానాలు కేటాయించాలని రేవంత్ ప్రభుత్వానికి ఈ సందర్భంగా ఆయన సూచించారు. రాష్ట్రంలో బీసీ చర్చ జరుగుతోందన్నారు. జయశంకర్ కన్న కలలు.. బీసీల తెలంగాణ కోసం బీసీ జేఏసీ యుద్ధం చేస్తుందని తెలిపారు. బీసీ 42 శాతం రిజర్వేషన్ల విషయంలో తప్పించుకునే ప్రయత్నాన్ని చేస్తున్నాయంటూ బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న నిప్పులు చెరిగారు. నిజామాబాద్ జిల్లా అగ్రవర్ణల నుంచి విముక్తి కోసం బీసీ జేఏసీ ఉద్యమిస్తుందంటూ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న స్పష్టం చేశారు.

Previous Post Next Post