రాష్ట్రంలో ఉన్న బీసీలను నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్

 రాష్ట్రంలో ఉన్న బీసీలను నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ 

నవంబరు 25 బీసీలకు చీకటి రోజు

 రిజర్వేషన్లపై సీఎం రేవంత్‌పై ఫైరైన బీసీ నేత, బిజెపి జిల్లా అధికార ప్రతినిధి బాలవర్ధన్ గౌడ్

జడ్చర్ల రూరల్, నవంబరు 26 (మనఊరు ప్రతినిధి): రాష్ట్రంలో ఉన్న బీసీలను నమ్మించి నయా వంచనకు గురి చేశారంటూ సీఎం రేవంత్ రెడ్డిపై బిజెపి జిల్లా అధికార ప్రతినిధి, బీసీ సంఘం నేత ఎడ్ల బాలవర్ధన్ గౌడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన నవంబరు 25ను బీసీలకు చీకటి రోజు, విద్రోహ దినంగా ప్రకటించారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే ముందు బీసీ రిజర్వేషన్లు 42 శాతానికి పెంచుతామని సీఎం రేవంత్ హామీ ఇచ్చి వెనక్కి తగ్గడం దారుణమని మండిపడ్డారు. కనీసం 20 శాతం కూడా రిజర్వేషన్ ఇవ్వకుండా కుట్రపూరితంగా తగ్గించారని ఆరోపించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జిల్లాను యూనిట్‌గా తీసుకుని రిజర్వేషన్లు ఖరారు చేయడం వల్ల బీసీలకు తీవ్రమైన అన్యాయం జరిగిందని విమర్శించారు. మండలాన్ని యూనిట్‌గా తీసుకుని రిజర్వేషన్లు ఖరారు చేయాలని, ఇప్పుడే ప్రకటించిన రిజర్వేషన్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం రిజర్వేషన్లను 22 శాతానికి తగ్గించడం ద్వారా ప్రభుత్వం బీసీల గొంతు కోశిందని, జీవో 46ను బేషరతుగా ఉపసంహరించుకోవాలని బాలవర్ధన్ గౌడ్ డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో కేసీఆర్ బీసీలకు 24 శాతం రిజర్వేషన్లు ఇస్తే, రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేవలం 17 శాతం మాత్రమే ఇచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత దారుణంగా మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి బీసీ ప్రజలు ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు.

Previous Post Next Post