శివాంజనేయ ఆలయంలో వైభవమైన హనుమత్‌ వ్రతం

శివాంజనేయ ఆలయంలో వైభవమైన హనుమత్‌ వ్రతం

శాసనసభ్యుడు డాక్టర్ కూచుకుల్ల రాజేష్‌రెడ్డి దంపతుల ప్రత్యేక పూజలు

నాగర్‌కర్నూలు, డిసెంబర్ 2 (మనఊరు ప్రతినిధి): పట్టణంలో కేసరి సముద్రం పక్కన ఉన్న పురాతన శ్రీ శివాంజనేయ స్వామి దేవాలయంలో హనుమాన్ జయంతి సందర్భంగా మంగళవారం సామూహిక హనుమత్‌ వ్రతాన్ని వైభవంగా నిర్వహించారు. నాగర్ కర్నూల్ గణేష్ బృందం, శివాంజనేయ భక్త బృందం ఆధ్వర్యంలో జరిగిన ఈ వ్రతానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.

ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుల్ల రాజేష్‌రెడ్డి వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. అనంతరం వేద మంత్రోచ్ఛరణల మధ్య వేదాశీర్వచనం తీసుకున్నారు. ఎమ్మెల్యే దంపతులను ఆలయ కమిటీ, గణేష్ బృంద సభ్యులు శాలువాలతో ఘనంగా సత్కరించారు.

వ్రతాన్ని వేదమూర్తులు ఓరుగంటి వేణుగోపాల్ శర్మ, ఏనమండ్ర రాజేశ్వర్ శర్మ శాస్త్రోక్తంగా నిర్వహించారు. కేసరి సముద్రం నిర్మాణ దశలోనే ఈ హనుమాన్ దేవాలయం వెలసిందని, చుట్టుపక్కల ఎండబెట్ల, చర్ల తిరుమలపూర్, ఉయ్యాలవాడ తదితర ప్రాంతాల్లో కూడా హనుమాన్ ఆలయాలు నిర్మించబడినట్లు ఆలయ ప్రధాన అర్చకులు రాజేశ్వర్ శర్మ తెలిపారు.

భక్తులు సింధూరంతో తమలపత్రంపై ‘శ్రీరామ’ నామాన్ని వ్రాసి వ్రతకల్పనలో పాల్గొన్నారు. రామభజన, సుందరకాండ పారాయణం జరిగే చోట హనుమంతుడు సాక్షాత్కారంగా విరాజిల్లుతాడని, ఆయనను ఆరాధించిన వారికి ఇతి, మానసిక బాధల నివారణ కలుగుతుందని అర్చకులు వివరించారు.

కార్తీకమాసం నుండి నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహించిన భక్త కమిటీ సభ్యులను ఖానాపురం బుచ్చన్న, తిమ్మాజిపేట రాములు, వెంకటేశ్వర్లు, మధు, జగన్, ఇందిరమ్మ, చంద్రకళ, సుమిత్ర, సత్యమ్మ, శీనులు తదితరులను శాలువాలతో అభినందించారు.

అనంతరం తీర్థప్రసాదాల పంపిణీతో పాటు 300 మందికి పైగా భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో గ‌ణేశ్ బృంద స‌భ్యులు, శివాంజనేయ కమిటీ సభ్యులు, సాయి భక్తులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




Previous Post Next Post