జనావాసాల మధ్య డంపింగ్ యార్డ్
ప్రజల కష్టాలు పట్టించుకోని అధికారులు
తక్షణమే డంపింగ్ యార్డ్ తరలించాలి
కల్వకుంట్ల కవిత డిమాండ్
కల్వకుర్తి రూరల్, ఆమనగల్, (మనఊరు ప్రతినిధి): తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో చేపట్టిన జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ముందుగా మైసిగండి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మున్సిపాలిటీ పరిధిలోని గుర్రం గుట్ట కాలనీలో ఉన్న డంపింగ్ యార్డ్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ జనావాసాలకు అతి సమీపంలో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దుర్వాసన, ఆరోగ్య సమస్యలు, పర్యావరణ కాలుష్యం కారణంగా ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారని తెలిపారు. అయినా సంబంధిత అధికారులు సమస్యపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. గతంలోనే మున్సిపాలిటీ పరిధిలోని డంపింగ్ యార్డ్‌ను ఎనిమిది కిలోమీటర్ల దూరానికి తరలించేందుకు రూ.1 కోటి 20 లక్షలు మంజూరు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ప్రజలు ఎన్నిసార్లు వినతులు ఇచ్చినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ప్రజల అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి గారు వెంటనే స్పందించి డంపింగ్ యార్డ్‌ను జనావాసాలకు దూరంగా తరలించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఇకనైనా ప్రజల అవసరాలను గుర్తించి అధికార యంత్రాంగం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆమె సూచించారు.



