సకాలంలో చికిత్సతో బ్రెయిన్ స్ట్రోక్ రోగి ప్రాణాలు కాపాడిన వైద్యులు
నాగర్‌కర్నూల్ జిల్లా జనరల్ ఆసుపత్రిలో వైద్యుల అప్రమత్తతకు ప్రశంసలు
నాగర్‌కర్నూల్, డిసెంబరు 29 (మనఊరు ప్రతినిధి): జిల్లా జనరల్ ఆసుపత్రి వైద్యులు తమ అప్రమత్తతతో ఓ బ్రెయిన్ స్ట్రోక్ రోగి ప్రాణాలను కాపాడి ప్రశంసలు అందుకుంటున్నారు. తెలకపల్లి మండలం గౌరెడ్డిపల్లి గ్రామానికి చెందిన పర్వతమ్మ (45) ఆదివారం రాత్రి అకస్మాత్తుగా తీవ్ర అస్వస్థతకు గురై బ్రెయిన్ స్ట్రోక్‌కు లోనయ్యారు. ఆమెకు ఎడమవైపు ముఖం వంకరగా మారడం, ఎడమ చేయి కదలకపోవడం, ఎడమ కాలు పడిపోవడం వంటి లక్షణాలు కనిపించడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను నాగర్‌కర్నూల్ జిల్లా జనరల్ ఆసుపత్రికి తరలించారు.
ఆసుపత్రి ఎమర్జెన్సీ విభాగంలో విధులు నిర్వహిస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కే. శంకర్ వెంటనే స్పందించి చికిత్స ప్రారంభించారు. రోగికి స్ట్రోక్ వచ్చినట్లు గుర్తించి తక్షణమే సిటీ స్కాన్ చేయించగా, మెదడుకు రక్త సరఫరాలో అంతరాయం ఏర్పడినట్టు నిర్ధారణ అయ్యింది. వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించి అవసరమైన ఇంజక్షన్‌ను సకాలంలో ఇచ్చి రోగిని అబ్జర్వేషన్‌లో ఉంచారు. సకాలంలో అందించిన చికిత్స ఫలితంగా ఎడమవైపు పనిచేయని ముఖం, చేయి, కాలు మెల్లగా సాధారణ స్థితికి రావడంతో పర్వతమ్మ ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండగా, ఐసీయూ వార్డులో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోందని తెలిపారు. ఈ విజయవంతమైన చికిత్సపై ఆసుపత్రి డిప్యూటీ సూపర్డెంట్ డాక్టర్ వి. శేఖర్, హెచ్‌వోడి డాక్టర్ శశికళ, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ శంకర్‌తో పాటు చికిత్స అందించిన ఎమర్జెన్సీ వైద్య బృందం, నర్సింగ్ ఆఫీసర్లను ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సూపర్డెంట్ డాక్టర్ వి. శేఖర్ మాట్లాడుతూ, స్ట్రోక్ వంటి అత్యవసర పరిస్థితుల్లో ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఆసుపత్రికి తీసుకురావడం వల్లే ప్రాణాలను కాపాడగలమన్నారు. కొద్దిసేపు ఆలస్యం జరిగినా పరిస్థితి తీవ్రంగా మారే ప్రమాదముందని హెచ్చరించారు. ఎమర్జెన్సీ సమయంలో సమర్థంగా స్పందించిన వైద్య బృందాన్ని ఆయన అభినందించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని రకాల అత్యవసర వైద్య సదుపాయాలు, ఆధునిక వసతులు అందుబాటులో ఉన్నాయని, ప్రజలు ఆపద సమయంలో ప్రభుత్వ ఆసుపత్రులను వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఇందుకోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. ఈ ఘటనతో నాగర్‌కర్నూల్ జిల్లా జనరల్ ఆసుపత్రి వైద్యుల సేవలపై రోగులు, ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు.

