ముగిసిన ఉచిత కంటి వైద్య శిబిరం

 మాడుగులలో ముగిసిన ఉచిత కంటి వైద్య శిబిరం

నిరుపేదలకు చూపు అందించడమే లక్ష్యం

ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి

కల్వకుర్తి, మాడ్గుల, డిసెంబరు 30 (మనఊరు ప్రతినిధి): నియోజకవర్గం మాడుగుల మండల కేంద్రంలో గత తొమ్మిది రోజులుగా ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరం మంగళవారం విజయవంతంగా ముగిసింది. ఈ శిబిరానికి ముఖ్య అతిథిగా ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి హాజరయ్యారు. శంకర నేత్రాలయ చెన్నై వైద్యుల సహకారంతో, సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి స్వంత ఖర్చులతో ఏర్పాటు చేసిన ఇది నాలుగో ఉచిత కంటి వైద్య శిబిరం అని నిర్వాహకులు తెలిపారు. ఇప్పటివరకు కల్వకుర్తి నియోజకవర్గం వ్యాప్తంగా పదివేల మందికిపైగా ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ చేసినట్లు వెల్లడించారు. మాడుగుల క్యాంపులో మొత్తం 5,500 మందికిపైగా హాజరుకాగా, 3,800 మందికి పైగా ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. వీరిలో 2,600 మందికి పైగా ఉచిత కంటి అద్దాలు పంపిణీ చేయగా, 143 మందికి కంటి శుక్లాల శస్త్రచికిత్సలు నిర్వహించినట్లు ఐక్యత ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. ముగింపు సభలో సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి మాట్లాడుతూ ఐక్యత ఆరోగ్య భరోసా కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పటికే మూడు ఉచిత ఐ క్యాంపులు విజయవంతంగా పూర్తయ్యాయని, నాలుగో క్యాంపును మాడుగుల మండలంలో గ్రామీణ ప్రజలకు అందుబాటులో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇప్పటివరకు నియోజకవర్గంలో 568 మందికి విజయవంతంగా కంటి శుక్లాల ఆపరేషన్లు చేయించడంతో పాటు, 10 వేల మందికిపైగా ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ చేశామని పేర్కొన్నారు. పేదవారికి వైద్యం భారం కాకూడదన్న ఉద్దేశంతో ఇలాంటి సేవా కార్యక్రమాలను భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామని ఆయన భరోసా ఇచ్చారు. శిబిరాన్ని సద్వినియోగం చేసుకున్న మాడుగుల మండలంతో పాటు పరిసర గ్రామాల ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులు మాట్లాడుతూ తమ కంటి సమస్యలను ఉచితంగా పరిష్కరించి చూపును ప్రసాదించిన సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఐక్యత ఫౌండేషన్ గౌరవ అధ్యక్షులు సుంకిరెడ్డి కృష్ణారెడ్డి, సుంకిరెడ్డి సుభాషిణి, శంకర నేత్రాలయ వైద్యులు డా. ఆర్తీ రాజ్‌కుమార్, డా. రాజీవ్ కుమార్, ఇంచార్జ్ బాను ప్రకాష్ రెడ్డి, ఐక్యత మాడుగుల ఇంచార్జ్ సూదిని జైపాల్ రెడ్డి, సభ్యులు నాగిళ్ళ శివ, ఎరుకలి శివ, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.



Previous Post Next Post