తెలంగాణ సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన ఆశాదీప్‌రెడ్డి
రాష్ట్రవ్యాప్తంగా సర్పంచుల సంపూర్ణ మద్దతు
కల్వకుర్తి, డిసెంబరు 30 (మనఊరు ప్రతినిధి): తెలంగాణ రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షుడిగా నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలంలోని తాండ్ర గ్రామ సర్పంచ్ కాయితి ఆశాదీప్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. హైదరాబాద్‌లో మంగళవారం నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర నూతన సర్పంచుల సమావేశంలో రాష్ట్రంలోని అన్ని గ్రామాల సర్పంచులు ఏకాభిప్రాయంతో ఆయనను సంఘం అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో కల్వకుర్తి మండలంతో పాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన సర్పంచులు భారీ సంఖ్యలో పాల్గొని ఆశాదీప్‌రెడ్డికి తమ సంపూర్ణ మద్దతును ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర సర్పంచుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు సౌదని భూమన్న యాదవ్ ఆశాదీప్‌రెడ్డికి నియామక పత్రాన్ని అందజేశారు. అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆశాదీప్‌రెడ్డి మాట్లాడుతూ, తనపై విశ్వాసం ఉంచి ఏకగ్రీవంగా ఎన్నుకున్న రాష్ట్రంలోని సర్పంచులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామం సమగ్ర అభివృద్ధి సాధించేలా సర్పంచులందరినీ కలుపుకొని సమన్వయంతో ముందుకు సాగుతానని స్పష్టం చేశారు. గ్రామాల మధ్య సమన్వయం పెంచి, స్థానిక సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడంలో సర్పంచుల సంఘం కీలక పాత్ర పోషిస్తుందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా తాగునీరు, రహదారులు, పారిశుధ్యం, విద్యుత్ సరఫరా, పాఠశాలలు, ఆరోగ్య సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. అలాగే గ్రామపంచాయతీలకు సంబంధించిన నిధుల కేటాయింపులు, అభివృద్ధి పనుల అమలులో ఎదురయ్యే సమస్యలను సమిష్టిగా పరిష్కరించేందుకు సర్పంచులందరితో కలిసి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికి చేరేలా సర్పంచులందరూ సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. రాజకీయాలకు అతీతంగా సర్పంచుల సంఘాన్ని బలోపేతం చేసి, గ్రామాభివృద్ధే లక్ష్యంగా ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు నిరంతరం కృషి చేస్తానని ఆశాదీప్‌రెడ్డి స్పష్టం చేశారు.
