మళ్లీ సర్పంచ్ కుర్చీ అత్త తర్వాత కోడలు…

 అత్త తర్వాత కోడలు… కోనాపూర్ లో ‘లక్కీ’ ఎస్టీ కుటుంబం!

సర్పంచ్ కుర్చీ మళ్లీ అదే ఇంటి కోడలికి వరించే అవకాశాలు

ఆమనగల్, డిసెంబరు 2 (మనఊరు ప్రతినిధి): రంగారెడ్డి జిల్లా, ఆమనగల్ మండలం, కోనాపూర్ప్ర ముఖంగా మారిన పంచాయతీ ఎన్నికల పోటీలో కోనాపూర్ గ్రామం ఇప్పుడు ప్రత్యేక చర్చకు కేంద్ర బిందువైంది. కారణం—ఒకే ఎస్టీ కుటుంబానికి వరుసగా రెండోసారి సర్పంచ్ పదవి వరించటం. 2013లో అత్త బెల్లంకొండ రాములమ్మ ఏకగ్రీవంగా సర్పంచ్ బాధ్యతలు చేపట్టగా… ఇప్పుడు అదే కుటుంబంలో కోడలు శ్రీలతకు కూడా సర్పంచ్ అయ్యే అవకాశం దక్కింది. గ్రామంలో మొత్తం 1,125 మంది ఓటర్లు ఉన్నప్పటికీ… ఎస్టీ వర్గానికి చెందినది ఒక్కటే కుటుంబం. అ కుటుంబంలో ఇద్దరు మహిళా ఓటర్లు, ఒక పురుష ఓటరు మాత్రమే ఉండటం విశేషం. ఈసారి సర్పంచ్ పదవి మళ్లీ ఎస్టీ వర్గానికి రిజర్వు కావడంతో, మరోసారి అదే కుటుంబం సర్పంచ్ పదవిని వరించబోతోంది. కోడలు శ్రీలత ఇప్పటికే నామినేషన్ దాఖలు చేయగా, పోటీ చేసే ఇతర ఎస్టీ అభ్యర్థులు గ్రామంలో లేని కారణంగా ఆమె ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. గ్రామ ప్రత్యేకత మొత్తం ఓటర్లు: 1,125, పురుషులు: 541, మహిళలు: 584, గ్రామంలో ఎస్టీ కుటుంబాలు: 1 ఎస్టీ వర్గానికి చెందిన ఓటర్లు: 3 (2 మహిళలు, 1 పురుషుడు) 2013లో సర్పంచ్: బెల్లంకొండ రాములమ్మ (ఏకగ్రీవం) 2025లో అంచనా: బెల్లంకొండ శ్రీలత (ఏకగ్రీవ అవకాశం)

బెల్లంకొండ శ్రీలత – కోనాపూర్ సర్పంచ్ అభ్యర్థి


గ్రామం అభివృద్ధిని అత్తగారి అడుగుజాడల్లో కొనసాగించేందుకు నేను ముందుకు వచ్చాను. పెద్దలు ఇచ్చే ఆశీర్వాదాలతో కోనాపూర్ మరింత ముందుకు తీసుకెళ్తాను.

బెల్లంకొండ సైదులు సర్పంచ్ అభ్యర్థి భర్త

మా కుటుంబానికి వరుసగా రెండోసారి ఈ అవకాశాన్ని ఇవ్వడం పట్ల గ్రామస్తులకు ధన్యవాదాలు. అత్తగారు చేసిన మంచి పనులను కొనసాగిస్తూ గ్రామానికి సేవ చేస్తాం.

Previous Post Next Post