రాగాయిపల్లిలో గందరగోళం...
అధికారులు దర్యాప్తు
సర్పంచ్ పదవికి 'వేలంపాట' ఆరోపణలు
కల్వకుర్తి, వెల్దండ, డిసెంబరు 2 (మనఊరు ప్రతినిధి): పంచాయితీ ఎన్నికల తొలి విడత నేపథ్యంలో నాగర్‌కర్నూల్ జిల్లాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వెల్దండ వారి రాగాయిపల్లి గ్రామ పంచాయతీలో సర్పంచ్ పదవిని వేలం వేసారన్న ఆరోపణ గ్రామంలో కలకలం రేపింది. అభ్యర్థి గణేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో, సందేశం వైరల్ కావడంతో గ్రామ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అభ్యర్థుల నామినేషన్లు ఉపసంహరించుకునేలా డబ్బులు, హామీలు ఇస్తున్నారని వచ్చిన ఫిర్యాదులపై అధికారులు వెంటనే కదిలారు. కల్వకుర్తి ఆర్డీవో జనార్దన్ రెడ్డి, వెల్దండ సీఐ విష్ణువర్ధన్ రెడ్డి గ్రామ పంచాయతీ కార్యాలయానికి చేరుకుని గ్రామ పెద్దలు, అభ్యర్థులతో సమావేశమై విచారణ జరిపారు. ఆరోపణలపై సమగ్రంగా విచారించిన అధికారులు ప్రస్తుతం ఎటువంటి స్పష్టమైన ఆధారాలు లభించలేదు. ఎన్నికల ప్రక్రియకు భంగం కలిగించే చర్యలు ఎవరివైపు నుంచి వచ్చినా కఠిన చర్యలు తీసుకుంటాం. గ్రామంలో ఉన్న ఉద్రిక్తత నేపథ్యంలో పోలీస్ భద్రతను కూడా పెంచినట్లు సమాచారం.
కల్వకుర్తి ఆర్డివో జనార్దన్ రెడ్డి
గ్రామస్థులు, అభ్యర్థుల వివరాలను సేకరించాం. గ్రామంలో శాంతిభద్రతలపై ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగుతోంది. ఎన్నికలు పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకుంటాం.
వెల్దండ సీఐ విష్ణువర్ధన్ రెడ్డి
నామినేషన్ల ఉపసంహరణకు ఒత్తిడి, బెదిరింపులు చేసినా వదిలిపెట్టడం. చట్టం అందరికీ సమానమే. గ్రామంలో ఏ అనుచిత సంఘటన జరిగినా వెంటనే చర్యలు తీసుకుంటాం.


