దేశ సేవ చేసిన భర్త… గ్రామ సేవకై ముందుకు వస్తున్న సునీత
వీల్‌చైర్‌లోనే డోర్, టూ డోర్ ప్రచారం
పెద్దాపూర్‌లో సునీత ఇంటింటి ప్రచారం
కల్వకుర్తి, డిసెంబరు 6 (మనఊరు ప్రతినిధి): మొదటి విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్లు ముగియడంతో నియోజకవర్గంలోని కల్వకుర్తి, వెల్దండ, ఉరుకొండ మండలాల్లో రాజకీయ వేడి పెరిగింది. అభ్యర్థులకు గుర్తులు కేటాయించడంతో గ్రామాల్లో ప్రచార హోరాహోరీ సాగుతోంది. వెల్దండ మండలం పెద్దాపూర్ గ్రామంలో సర్పంచ్ పదవికి ఎస్సి మహిళ రిజర్వేషన్ రావడంతో గ్రామానికి చెందిన సునీత నామినేషన్ దాఖలు చేశారు. అయితే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే ముందు రోడ్డు ప్రమాదంలో గాయాలపాలైన సునీత, శారీరక ఇబ్బందులు ఉన్నప్పటికీ వెనక్కు తగ్గలేదు. వీల్‌చైర్‌లోనే గ్రామంలో తిరుగుతూ డోర్, టూ డోర్ ప్రచారం చేస్తూ ఓటర్లను కలుస్తూ మద్దతు కోరుతున్నారు. గాయాలు ఉన్నా పట్టుదలతో ముందుకు సాగే ఆమె తీరు గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ… నా భర్త మాజీ సైనికుడు. దేశానికి సేవ చేశాడు. ఆయన మాదిరిగానే నేను కూడా గ్రామానికి సేవ చేయాలనుకుంటున్నాను. ప్రజల ఆశీస్సులతో సర్పంచ్‌గా గెలిస్తే పెద్దాపూర్ అభివృద్ధికి కృషి చేస్తాను అని తెలిపారు. గ్రామస్తులు కూడా ఆమె ధైర్యం, పట్టుదలను ప్రశంసిస్తున్నారు.





