అంతర్జాతీయ అవార్డు అందుకున్న వెంకప్ప భాగవతులు
ఇందూర్, ఖతార్, డిసెంబరు 6 (మనఊరు ప్రతినిధి): ఖతార్‌లో సుదీర్ఘకాలంగా సమాజ సేవలో విశేషమైన సేవలు అందిస్తున్న విశాఖ వాసి, కమ్యూనిటీ నాయకుడు, హ్యూమానిటేరియన్ శ్రీ వెంకప్ప భాగవతుల కు అంతర్జాతీయ గౌరవం లభించింది. గ్లోబల్ ఇండియన్ ఆర్గనైజేషన్ (జిఐఒ) నిర్వహించిన నాల్గవ అంతర్జాతీయ మహాసభలో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయనకు ఉత్తమ సేవా పురస్కారం ప్రదానం చేశారు. విశాఖకు చెందిన వెంకప్ప భాగవతులు గత 20 సంవత్సరాలుగా ఖతార్‌లో నివసిస్తూ స్థానికంగా మాత్రమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ గుర్తింపు పొందారు. ప్రజా సమస్యలు, దాతృత్వ కార్యక్రమాలు, విద్య ఆరోగ్య రంగాల్లో చేయూతనిస్తూ అనేక సేవా కార్యక్రమాలకు ప్రాధాన్యమిస్తూ సామాజిక బాధ్యతగా భావించి పని చేస్తున్నారు. పురస్కారం స్వీకరించిన అనంతరం వెంకప్ప భాగవతులు మాట్లాడుతూ ఈ అవార్డు నా వ్యక్తిగత కృషికే కాదు. నా ప్రయాణంలో నాతో పాటు నిలిచిన సహచరులు, భాగస్వాములు, గురువులు, మిత్రులు, సమాజ సభ్యుల సమిష్టి అంకితభావానికి ఇది గుర్తింపు అన్నారు. అలాగే జిఐఒ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్, నిర్వాహకులకు ధన్యవాదాలు తెలుపుతూ ఈ గౌరవం నన్ను మరింత సేవా కార్యక్రమాల వైపు నడిపిస్తుందనే నమ్మకం ఉంది. స్థానికంగా మరియు అంతర్జాతీయంగా సమాజ అభివృద్ధి కోసం ముందుకు సాగుతాను. అని తెలిపారు. విశాఖ వాసికి లభించిన ఈ అంతర్జాతీయ పురస్కారంపై ప్రవాస భారతీయులు, కమ్యూనిటీ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.


