ఇంటి తాళాలు విరగొట్టి బంగారం, నగదు చోరీ
తలకొండపల్లి, డిసెంబరు 29 (మనఊరు ప్రతినిధి): మండలంలోని చంద్రధన గ్రామంలో ఓ ఇంటి తాళాలు విరగొట్టి భారీ ఎత్తున బంగారు ఆభరణాలు, నగదు దుండగులు దోచుకున్నారు. వివరాల్లోకి వెళితే.. ఎస్సై ఎ. శ్రీకాంత్ కథనం మేరకు.. చంద్రధన గ్రామానికి చెందిన ఆవుల భారతమ్మ ఆదివారం ఉదయం బంధువుల ఇంట్లో పూజ ఉండటంతో ఇబ్రహీంపట్నానికి వెళ్లారు. అనంతరం సోమవారం ఉదయం సుమారు 10 గంటల సమయంలో ఇంటికి తిరిగి రాగా, ఇంటి తాళాలు విరగొట్టబడి ఉన్నట్లు గుర్తించారు. ఇంట్లోకి వెళ్లి పరిశీలించగా, ఇంట్లో భద్రపరచిన మూడు తులాల బంగారం, రూ.40 వేల నగదు కనిపించలేదని తెలిపారు. గుర్తుతెలియని వ్యక్తులు ఈ చోరీకి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై వెల్లడించారు.

