యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ స్థల పరిశీలించిన అధికారులు

 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ పనులు త్వరలో ప్రారంభం

రూ.200 కోట్లతో 20 ఎకరాల్లో విద్యా ప్రాజెక్టు 

– చీఫ్ ఇంజనీర్ శశిధర్

కల్వకుర్తి, తలకొండపల్లి, (మనఊరు ప్రతినిధి): నియోజకవర్గంలోని తలకొండపల్లి మండలంలోని ఖానాపూర్ గ్రామంలో ఏర్పాటు చేయనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ప్రాంగణాన్ని చీఫ్ ఇంజనీర్ (ప్రాజెక్టులు) పి. శశిధర్ గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా స్థల పరిస్థితులు, ప్రాజెక్టు అమలుకు అవసరమైన ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. గ్రామ సర్పంచ్ దుగ్గాపురం అనిత శ్రీనివాస్ చీఫ్ ఇంజనీర్‌ను కలిసి, ప్రాజెక్టు పనులను వెంటనే ప్రారంభించి నిర్ణీత కాలంలో పూర్తిచేయాలని కోరారు. స్పందించిన శశిధర్, 20 ఎకరాల విస్తీర్ణంలో రూ.200 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు పనులు త్వరలో ప్రారంభమవుతాయని తెలిపారు.

నాణ్యత ప్రమాణాలు, కాలపరిమితులను కచ్చితంగా పాటిస్తూ ఈ ప్రాజెక్టును విజయవంతంగా, ఆదర్శవంతంగా అభివృద్ధి చేస్తామని ఆయన భరోసా ఇచ్చారు. ఈ స్కూల్ ఏర్పాటు ద్వారా ప్రాంతంలో విద్యా మౌలిక వసతులు మరింత బలోపేతం అవుతాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఖానాపూర్ గ్రామపంచాయతీ పరిధిలో చీఫ్ ఇంజనీర్ శశిధర్‌ను గ్రామ సర్పంచ్ అనిత శ్రీనివాస్, ఉపసర్పంచ్ గోపాల్ నాయక్, వార్డు సభ్యులు శాలువాలతో ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు బి. ప్రవీణ్ కుమార్, శిరీష, బాలరాజు, జంగయ్య, రాజు నాయక్, మౌనిక, రాజేందర్, రఘుమారెడ్డి, అజయ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు బి. వెంకట్రాంరెడ్డి, శంకర్ నాయక్, మాజీ ఉపసర్పంచులు కర్ణాకర్ రెడ్డి, రవి నాయక్, గ్రామస్తులు రాములు, కృష్ణ, దేవేందర్, రాజేందర్, బామ్ల భూపాల్ గౌడ్, పర్వతాలు, సుధాకర్ రెడ్డి, శివాజీ, ఏఈఈ సందీప్, ఈఈ రంగారెడ్డి రామ్ కుమార్, డీఈఈ కరీముద్దీన్, తదితరులు పాల్గొన్నారు.



Previous Post Next Post