గుడిసెలు వేసి ప్రభుత్వానికి సవాల్ విసిరిన కవిత

 ఉద్యమకారుల హక్కుల కోసం భూ పోరాటం

మానకొండూరులో గుడిసెలు వేసి ప్రభుత్వానికి సవాల్ విసిరిన కవిత

కరీంనగర్, మానకొండూరు, డిసెంబరు 31 (మనఊరు ప్రతినిధి): తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కరీంనగర్ జిల్లా మానకొండూరులో భూ పోరాటానికి శ్రీకారం చుట్టారు. పోలీస్ స్టేషన్ సమీపంలోని సుమారు ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిని ఉద్యమకారులతో కలిసి ఆక్రమించి గుడిసెలు వేయించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఉద్యమకారులకు 250 గజాల చొప్పున ఇంటి స్థలాలు కేటాయించాలని కవిత డిమాండ్ చేశారు. భూ పోరాటానికి ముందు కరీంనగర్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించిన ఆమె, అనంతరం మానకొండూరుకు చేరుకుని ఉద్యమాన్ని ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రం ఉద్యమకారుల త్యాగాల ఫలితమేనని, కానీ రాష్ట్రం ఏర్పడి ఏళ్లు గడుస్తున్నా వారికి తగిన గౌరవం, న్యాయం దక్కలేదని ప్రభుత్వంపై కవిత తీవ్ర విమర్శలు గుప్పించారు. ఉద్యమకారుల గుర్తింపు పేరుతో మళ్లీ కమిటీలు వేసి కాలయాపన చేయడం సరికాదని ఆమె స్పష్టం చేశారు. ఏ గ్రామంలో ఎవరు ఉద్యమకారులో అక్కడి ప్రజలే నిర్ణయిస్తారని, ప్రజలు సూచించిన వారినే ఉద్యమకారుల జాబితాలో చేర్చాలని ఆమె డిమాండ్ చేశారు. డిసెంబర్ 9లోగా ఉద్యమకారులకు పెన్షన్, సంక్షేమ బోర్డు ఏర్పాటు, ఇంటి స్థలాల వంటి హామీలను నెరవేర్చకపోతే భూ పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ భూ పోరాటం కేవలం కరీంనగర్‌కే పరిమితం కాదని, రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తుందని కవిత ప్రకటించారు. హైదరాబాద్, రంగారెడ్డి వంటి జిల్లాల్లోనూ ఉద్యమాలు చేపడతామని స్పష్టం చేశారు. ప్రభుత్వం దిగివచ్చే వరకు పోరాటం ఆగదని, ఇది ఉద్యమకారుల ఆత్మగౌరవ పోరాటమని ఆమె తేల్చిచెప్పారు.

Previous Post Next Post