ప్రైవేట్ స్కూళ్ల సమస్యలను ఐకమత్యంగా ఎదుర్కోవాలి
ట్రస్మా రాష్ట్ర అధ్యక్షులు డా. శివరాత్రి యాదగిరి పిలుపు
జడ్చర్ల, డిసెంబరు 31 (మనఊరు ప్రతినిధి): ప్రైవేట్ పాఠశాలలు ఎదుర్కొంటున్న సమస్యలను సంఘటితంగా, ఐకమత్యంగా ఎదుర్కొన్నప్పుడే శాశ్వత పరిష్కారం సాధ్యమవుతుందని ట్రస్మా (తెలంగాణ రాష్ట్ర ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్‌మెంట్స్ అసోసియేషన్) రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ శివరాత్రి యాదగిరి అన్నారు. జడ్చర్ల పట్టణ కేంద్రంలోని న్యూ సన్‌రైస్ హైస్కూల్‌లో నిర్వహించిన ట్రస్మా మహబూబ్‌నగర్ జిల్లా సర్వసభ్య సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా డాక్టర్ యాదగిరి మాట్లాడుతూ, ప్రైవేట్ పాఠశాలల కరస్పాండెంట్లు ఎదుర్కొంటున్న పరిపాలనా, ఆర్థిక, నిబంధనల సంబంధిత సమస్యలను ట్రస్మా సంఘం ద్వారా సమన్వయంతో పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. బలమైన సంఘం లేకుండా సమస్యల పరిష్కారం సాధ్యం కాదని, ఆ సంఘం మనదై ఉండాలని, అందరూ కలిసి ముందుకు సాగితే ప్రభుత్వ స్థాయిలోనూ న్యాయం సాధించవచ్చని ఆయన స్పష్టం చేశారు. రానున్న విద్యా సంవత్సరంలో ట్రస్మా ఆధ్వర్యంలో అన్ని ప్రైవేట్ పాఠశాలలను మరింత బలోపేతం చేసే దిశగా కార్యాచరణ చేపడతామని తెలిపారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో త్వరలో బహిరంగ సభతో పాటు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించి, ప్రతి కరస్పాండెంట్‌తో ప్రత్యక్షంగా చర్చించి సమస్యలను పరిష్కరిస్తామని డాక్టర్ శివరాత్రి యాదగిరి హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో మేడ్చల్ జిల్లా ట్రస్మా అధ్యక్షులు జే. నాగరాజు, మేడ్చల్ జిల్లా ఖజాంచి కె. పరుశురాం గౌడ్, ట్రస్మా రాష్ట్ర ఉపాధ్యక్షులు డానియల్ రాజ్, డాక్టర్ బోసాని బాలరాజు (రాష్ట్ర మీడియా సెల్ కన్వీనర్), రాష్ట్ర ఉపాధ్యక్షులు మేఘారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లా గౌరవాధ్యక్షులు వేణుగోపాల్, జడ్చర్ల పట్టణ ట్రస్మా అధ్యక్షులు నరేష్, జిల్లా మీడియా సెల్ కన్వీనర్ కృష్ణమోహన్‌తో పాటు వివిధ ప్రైవేట్ పాఠశాలల కరస్పాండెంట్లు పాల్గొన్నారు.
