ట్రస్మా జిల్లా అధ్యక్షులుగా ఆయుబ్ ఖాన్ ఏకగ్రీవంగా ఎన్నిక
జడ్చర్లలో నిర్వహించిన జిల్లా సర్వసభ్య సమావేశంలో నిర్ణయం
ట్రస్మా జిల్లా అధ్యక్షులుగా ఆయుబ్ ఖాన్
జడ్చర్ల, డిసెంబరు 31 (మనఊరు ప్రతినిధి): తెలంగాణ రాష్ట్ర ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్‌మెంట్స్ అసోసియేషన్ (ట్రస్మా) మహబూబ్‌నగర్ జిల్లా అధ్యక్షులుగా ఆయుబ్ ఖాన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జడ్చర్ల పట్టణ కేంద్రంలో బుధవారం నిర్వహించిన ట్రస్మా జిల్లా సర్వసభ్య సమావేశంలో ఈ ఎన్నిక జరిగింది. గత కొంతకాలంగా ఖాళీగా ఉన్న జిల్లా అధ్యక్ష పదవిని భర్తీ చేస్తూ సభ్యులందరి ఏకాభిప్రాయంతో ఆయుబ్ ఖాన్‌ను జిల్లా అధ్యక్షులుగా ఎన్నుకున్నారు. ప్రైవేట్ పాఠశాలల సమస్యల పరిష్కారానికి సంఘాన్ని మరింత బలోపేతం చేసే దిశగా పనిచేస్తానని ఆయుబ్ ఖాన్ ఈ సందర్భంగా తెలిపారు. ఈ సమావేశానికి ట్రస్మా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ శివరాత్రి యాదగిరి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రైవేట్ పాఠశాలలు ఎదుర్కొంటున్న సమస్యలను ఐకమత్యంగా ఎదుర్కొనాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. ట్రస్మా ఆధ్వర్యంలో అన్ని పాఠశాలల కరస్పాండెంట్ల సమస్యలను ప్రభుత్వ స్థాయిలో పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా నూతన జిల్లా అధ్యక్షులు ఆయుబ్ ఖాన్‌ను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ట్రస్మా రాష్ట్ర, జిల్లా, పట్టణ నాయకులు, వివిధ ప్రైవేట్ పాఠశాలల కరస్పాండెంట్లు పాల్గొన్నారు.
