నూతన ట్రాక్టర్ కింద నలిగిన పసిప్రాణం
తండ్రి కళ్లముందే ఐదేళ్ల కుమారుడి దుర్మరణం
చిన్న ఆదిరాల గ్రామంలో హృదయ విదారక ఘటన
జడ్చర్ల రూరల్, డిసెంబరు 28 (మనఊరు ప్రతినిధి): వ్యవసాయ పనుల కోసం మూడు రోజుల క్రితమే కొనుగోలు చేసిన నూతన ట్రాక్టర్ ఒక పసిప్రాణాన్ని బలితీసుకున్న హృదయ విదారక ఘటన జడ్చర్ల మండలంలోని చిన్న ఆదిరాల గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. ఈ ఘటన గ్రామాన్ని తీవ్ర విషాదంలో ముంచింది. గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం… చిన్న ఆదిరాల గ్రామానికి చెందిన శివకుమార్–ఉమారాణి దంపతులకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. కుమారుడు మణిదీప్ (5). శివకుమార్ వ్యవసాయ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. వ్యవసాయ అవసరాల నిమిత్తం మూడు రోజుల క్రితం షోరూమ్ నుంచి నూతన ట్రాక్టర్‌ను కొనుగోలు చేశాడు. ఆదివారం తన పొలానికి ట్రాక్టర్‌ను తీసుకెళ్లి పనులు చేస్తుండగా, ట్రాక్టర్ తాళం చెయ్యి (కీ) అలాగే ఉండగానే ఇతర పనుల్లో నిమగ్నమయ్యాడు. అదే సమయంలో అక్కడే ఆడుకుంటూ వచ్చిన మణిదీప్ ట్రాక్టర్‌పైకి ఎక్కి అనుకోకుండా ఇంజిన్‌ను ఆన్ చేశాడు. ఒక్కసారిగా ట్రాక్టర్ ముందుకు కదలడంతో బాలుడు కింద పడిపోయాడు. వెంటనే ట్రాక్టర్ అతని మీద నుంచి వెళ్లడంతో మణిదీప్ అక్కడికక్కడే మృతి చెందాడు. తల్లిదండ్రులు పరుగున వచ్చేసరికి కుమారుడు విగతజీవిగా పడి ఉండడం చూసి కన్నీరుమున్నీరయ్యారు. కళ్లముందే కుమారుడు ప్రాణాలు విడిచిపోతుండగా ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్న తల్లిదండ్రుల రోదనను చూసి గ్రామస్తులు కూడా కంటతడి పెట్టారు. వ్యవసాయ పనుల కోసం కొనుగోలు చేసిన ట్రాక్టర్ తమ చిన్నారి ప్రాణాలను తీస్తుందని ఊహించలేదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనతో చిన్న ఆదిరాల గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.
