పట్టణ అభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం
ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి
పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి
కల్వకుర్తి, డిసెంబరు 28 (మనఊరు ప్రతినిధి):
పట్టణంలో మౌలిక సదుపాయాలు కల్పించి సమగ్ర అభివృద్ధి సాధించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. ఆదివారం కల్వకుర్తి పట్టణంలోని బస్టాండ్ సమీపంలో పోస్టాఫీస్ నుంచి బొక్కలకుంట వరకు నూతన సీసీ రోడ్డుకు ఆయన శంకుస్థాపన చేశారు. అలాగే ఇందిరానగర్ కాలనీలో 20వ, 21వ వార్డులలో నూతన సీసీ రోడ్ల నిర్మాణ పనులకు కూడా శంకుస్థాపనలు చేపట్టారు.
అదేవిధంగా కల్వకుర్తి నుంచి కైలాసం గుట్టకు వెళ్లే దారిలో మానస గార్డెన్ సమీపంలో నూతన కల్వర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పట్టణంలోని 6వ వార్డులో గల సిలార్‌పల్లి ఈదుల చెరువును రూ.2 కోట్ల 20 లక్షల వ్యయంతో సుందరీకరించనున్నట్లు ఎమ్మెల్యే ఈ సందర్భంగా తెలిపారు.
ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమం, మౌలిక వసతుల అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తోందన్నారు. పట్టణంతో పాటు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఆయన పేర్కొన్నారు.







