రైతులు యూరియాను వృథా చేయవద్దు

 యూరియా వినియోగంపై రైతులకు అవగాహన

బాదేపల్లి ఆగ్రో రైతు సేవా కేంద్రం–2ను తనిఖీ చేసిన బాలు నాయక్

జడ్చర్ల, డిసెంబరు 31 (మనఊరు ప్రతినిధి): రైతులు యూరియాను వృథా చేయవద్దని రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయం సంయుక్త సంచాలకులు, మహబూబ్‌నగర్ జిల్లా నోడల్ అధికారి బాలు నాయక్ సూచించారు.  బుధవారం జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని బాదేపల్లి గ్రామంలో ఉన్న ఆగ్రో రైతు సేవా కేంద్రం–2ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి బి. వెంకటేష్ కూడా పాల్గొన్నారు. ఈ తనిఖీల సందర్భంగా ఆగ్రో రైతు సేవా కేంద్రంలో యూరియా కొనుగోలు వివరాలు, యూరియా బుకింగ్ విధానాన్ని రైతులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అలాగే యూరియా వినియోగంపై రైతులకు అవగాహన కల్పించారు. రైతులతో మాట్లాడుతూ యూరియాను వృథా చేయవద్దని సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంటలకు యూరియా వేస్తున్నప్పుడు మొక్క దగ్గర వేసిన అనంతరం మట్టితో కప్పితే, యూరియాను మొక్కలు సమర్థవంతంగా గ్రహిస్తాయని వివరించారు. అవసరానికి మించి యూరియా వినియోగం చేయకుండా, అవసరమైన మేరకే కొనుగోలు చేయాలని రైతులకు సూచించారు.

జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 17,610 మంది రైతులు ఆన్‌లైన్‌లో 52,545 యూరియా బ్యాగులను బుక్ చేసుకున్నారని తెలిపారు. అందులో 46,193 బ్యాగులను రైతులు ఇప్పటికే కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. ఇంకా 26,220 యూరియా బస్తాలు యాప్‌లో కొనుగోలు కోసం సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. కావున రైతులు యూరియా కొరతపై ఎలాంటి ఆందోళనకు గురికాకుండా యూరియా బుకింగ్ యాప్ ద్వారా కొనుగోలు చేయాలని సూచించారు. యూరియా కొనుగోలు కోసం వచ్చే రైతులు తప్పనిసరిగా తమ ఆధార్ కార్డు, పట్టా పాస్‌బుక్ తీసుకురావాలని తెలిపారు.







Previous Post Next Post