ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు వెంటనే చెల్లించాలి

 ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు వెంటనే చెల్లించాలి

బకాయిల చెల్లింపులో ప్రభుత్వ వివక్ష – రిటైర్డ్ ఎంప్లాయిస్ ఫోరం

మహబూబ్‌నగర్, డిసెంబరు 31 (మనఊరు ప్రతినిధి): నూతన సంవత్సరం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, సర్వీసులో కొనసాగుతున్న ఉద్యోగుల బకాయిల చెల్లింపుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.713 కోట్లను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే అదే ప్రభుత్వం ఆర్టీసీలో పదవీ విరమణ చేసిన ఉద్యోగుల బకాయిలను ఇప్పటికీ చెల్లించకపోవడం తీవ్ర వివక్షకు నిదర్శనమని ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయిస్ ఫోరం అధ్యక్షుడు రాజసింహుడు, కార్యదర్శి కె. రవీందర్ రెడ్డి ఒక ప్రకటనలో ఆరోపించారు.

2024 నుంచి పదవీ విరమణ చేసిన ఆర్టీసీ ఉద్యోగులకు చెల్లించాల్సిన లీవ్ ఎన్‌కాష్‌మెంట్, టెర్మినల్ బెనిఫిట్స్‌తో పాటు 2017 పే స్కేల్‌కు సంబంధించిన గ్రాట్యుటీ, లీవ్ ఎన్‌కాష్‌మెంట్ డిఫరెన్స్, డీఏ బకాయిలు ఇప్పటికీ చెల్లించలేదని వారు తెలిపారు. అలాగే ఇటీవల పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు సంబంధించిన గ్రాట్యుటీ, పీఎఫ్ తదితర బకాయిలు కూడా పెండింగ్‌లోనే ఉన్నాయని పేర్కొన్నారు.

బకాయిలు చెల్లించకపోవడం వల్ల ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారి పరిస్థితి వర్ణనాతీతంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సిన అన్ని బకాయిలను తక్షణమే చెల్లించాలని వారు డిమాండ్ చేశారు.

Previous Post Next Post