అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం 27 మందికి గాయాలు

 మాచారం వద్ద అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం

27 మందికి గాయాలు 

 ఘటన స్థలాన్ని పరిశీలించిన అడిషనల్ ఎస్పీ రత్నం

జడ్చర్ల రూరల్, జనవరి 14 (మనఊరు ప్రతినిధి): మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం మాచారం సమీపంలోని 44వ జాతీయ రహదారిపై అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పండుగ వేళ ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు ముందుగా వెళ్తున్న డీసీఎం లారీని వెనుక నుంచి ఢీకొనడంతో 27 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. కొల్లాపూర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు హైదరాబాద్ నుంచి కర్నూలు వైపు వెళ్తుండగా, అర్ధరాత్రి సమయంలో మాచారం వద్ద ముందుగా వెళ్తున్న డీసీఎం లారీ అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో బస్సు అదుపు తప్పి బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసం కాగా, అద్దాలు పగిలిపోయాయి. బస్సు డ్రైవర్ స్టీరింగ్ వద్ద ఇరుక్కుపోగా, మరో 27 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను అంబులెన్స్‌ల ద్వారా మహబూబ్‌నగర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం గాయపడిన వారందరికీ చికిత్స కొనసాగుతుండగా, ఎవరి ప్రాణాలకు ప్రమాదం లేదని అధికారులు తెలిపారు. విషయం తెలుసుకున్న జిల్లా అడిషనల్ ఎస్పీ ఎన్.బి. రత్నం సంఘటన స్థలాన్ని పరిశీలించి, ఆసుపత్రిలో గాయపడిన వారిని పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పండుగ కారణంగా బస్సులో మొత్తం 53 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదానికి బస్సు డ్రైవర్ అజాగ్రత్తతో పాటు అతివేగమే ప్రధాన కారణం అని తెలిపారు. ఇదిలా ఉండగా, ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాల్లో రికార్డు అయినట్లు పోలీసులు వెల్లడించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.







Previous Post Next Post