నేతాజీ ఆశయాలు యువతకు స్ఫూర్తి కావాలి

 నేతాజీ ఆశయాలు యువతకు స్ఫూర్తి కావాలి

కావేరమ్మపేటలో ఘనంగా నేతాజీ జయంతి వేడుకలు


జడ్చర్ల రూరల్, జనవరి 23 (మనఊరు ప్రతినిధి): భారత స్వాతంత్య్ర సంగ్రామంలో తనదైన ముద్ర వేసిన మహనీయుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని, ఆయన ఆశయాలను నేటి యువత స్ఫూర్తిగా తీసుకోవాలని కావేరమ్మపేట గణేష్ యూత్ సేన సభ్యులు పిలుపునిచ్చారు. నేతాజీ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం గ్రామంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కావేరమ్మపేట గ్రామ చావిడి ఎదురుగా ఉన్న నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి గణేష్ యూత్ సేన ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం నేతాజీ చేసిన త్యాగాలు, దేశ స్వాతంత్య్రం కోసం ఆయన సాగించిన పోరాటాన్ని స్మరించుకున్నారు. పలువురు నాయకులు మాట్లాడుతూ, బానిస సంకెళ్లను తెంచుకోవడానికి ఆజాద్ హింద్ ఫౌజ్‌ను స్థాపించి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులను ఏకం చేసిన ధీశాలి నేతాజీ అని కొనియాడారు. ఆయన చూపిన ధైర్యం, క్రమశిక్షణ, దేశభక్తి నేటి తరం యువతకు మార్గదర్శకమని పేర్కొన్నారు. ప్రతి యువకుడు దేశభక్తిని పెంపొందించుకుని సమాజ సేవలో ముందుండటమే నేతాజీకి ఇచ్చే నిజమైన నివాళి అని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ బుక్క మహేష్, మాజీ వార్డు సభ్యులు గుండు చంద్రమౌళి, నాయకులు చటమోని రమేష్, బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధికార ప్రతినిధి బుక్క నవీన్, బుక్క లక్ష్మయ్య, మిద్దె మల్లేష్, గణేష్ యూత్ సేన సభ్యులు గుండు చంద్రశేఖర్, గోనెల నరేందర్, బుక్క శివకుమార్, మిద్దె నాగరాజు, బుక్క కుమార్, వేణు, మల్లేష్, ఎజాస్‌తో పాటు గ్రామ పెద్దలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Previous Post Next Post