మృతురాలి కుటుంబానికి రాధాకృష్ణ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ చేయూత
కడ్తాల్ మాజీ జెడ్పీటీసీ దశరథ్ నాయక్ భరోసా
కల్వకుర్తి, కడ్తాల్, జనవరి 27 (మనఊరు ప్రతినిధి): కడ్తాల్ మండలంలోని మైసిగండి గ్రామపంచాయతీకి చెందిన జటోత్ కమ్లి అనారోగ్యంతో సోమవారం సాయంత్రం మృతి చెందారు. విషయం తెలుసుకున్న గ్రామ నాయకుల ద్వారా మృతురాలి కుటుంబ పరిస్థితిని తెలుసుకున్న కడ్తాల్ మాజీ జెడ్పీటీసీ, లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు దశరథ్ నాయక్, మృతురాలి కుటుంబానికి ఎలాంటి స్థిరాస్తులు లేకపోవడంతో ఇది నిరుపేద కుటుంబమని గుర్తించి వెంటనే స్పందించారు. మృతురాలి కుటుంబానికి అండగా ఉంటామని, అధైర్యపడొద్దని భరోసా కల్పిస్తూ తమ రాధాకృష్ణ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున తక్షణమే రూ.5,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అనంతరం జటోత్ కమ్లి మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ తులసి రామ్ నాయక్, మాజీ ఎంపీటీసీ సక్రి, గ్రామ కమిటీ అధ్యక్షుడు రవి నాయక్, మాజీ వార్డు సభ్యుడు పత్తి నాయక్, నాయకులు శీను, శివ, మల్లేష్, గోపాల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
