మార్చాల గ్రామంలో సయ్యద్ సుల్తాన్ అలీ షా ఉర్సు షరీఫ్

 మార్చాల గ్రామంలో సయ్యద్ సుల్తాన్ అలీ షా ఉర్సు షరీఫ్ జాతర

మత సామరస్యానికి ప్రతీకగా జాతర  

28న భక్తులతో సందడి

కల్వకుర్తి రూరల్, జనవరి 27  (మనఊరు ప్రతినిధి): మండలంలోని మార్చాల గ్రామ సమీపంలో పల్లగుట్టపై వెలసిన హజ్రత్ సయ్యద్ సుల్తాన్ అలీ షా బొఖారి రహమతుల్లా అలయ్ ఉర్సు షరీఫ్ (జాతర)ను ఈ నెల 28వ తేదీన ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఉర్సు కార్యనిర్వాహకులు మహమ్మద్ షకీల్ తెలిపారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా జనవరి 27వ తేదీన గ్రామం నుంచి సంప్రదాయబద్ధంగా “గంధం” తీస్తారని ఆయన వివరించారు. గత కొన్ని సంవత్సరాలుగా కీ.శే. డాక్టర్ సుల్తాన్ ఆధ్వర్యంలో ఉర్సు జాతర వైభవంగా నిర్వహించబడిందని, ఆయన మృతి అనంతరం ఆయన వారసుడైన మహమ్మద్ షకీల్ ఆధ్వర్యంలో ఉర్సు కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ దర్గా ప్రశాంతతకు, ఆధ్యాత్మిక శాంతికి నిలయంగా భక్తులకు ప్రసిద్ధి చెందింది. కుల, మత బేధాలు లేకుండా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఇక్కడికి చేరుకొని తమ కోరికలు నెరవేరాలని ప్రార్థనలు చేస్తుంటారు. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన ఈ ఉర్సు జాతర సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు, గంధోత్సవం వైభవంగా జరుగుతాయి. ప్రత్యేకంగా 28వ తేదీ సాయంత్రం భక్తుల సంఖ్య భారీగా పెరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. ప్రతి సంవత్సరం ఇక్కడ జరిగే ఉర్సు ఉత్సవాలు భక్తిశ్రద్ధల మధ్య అత్యంత వైభవంగా కొనసాగుతుండటం విశేషం.



Previous Post Next Post