జైపాల్ రెడ్డి పేరుతో కల్వకుర్తిని జిల్లాగా ప్రకటించాలి
ఆమనగల్‌కు డివిజన్ కార్యాలయాలు ఏర్పాటు చేస్తే మున్సిపల్ పోటీకి దూరం
జాతీయ బిసి కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచారి
కల్వకుర్తి, జనవరి 16 (మన ఊరు ప్రతినిధి): ఉత్తమ పార్లమెంటేరియన్ స్వర్గీయ సూదిని జైపాల్ రెడ్డి పేరుతో కల్వకుర్తిని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు, బీజేపీ సీనియర్ నాయకులు తల్లోజు ఆచారి డిమాండ్ చేశారు. అదేవిధంగా ఆమనగల్ కేంద్రంలో సబ్ రిజిస్ట్రేషన్, ఆర్డీవో, ఎస్టీఓ, ఆర్టీఓ వంటి కీలక ప్రభుత్వ డివిజన్ కార్యాలయాలు ఏర్పాటు చేస్తే, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కల్వకుర్తి – ఆమనగల్ మున్సిపాలిటీల్లో బీజేపీ పోటీకి దూరంగా ఉంటుందని ఆయన సంచలన ప్రకటన చేశారు. ఈ వ్యాఖ్యలతో కల్వకుర్తి, ఆమనగల్ రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. బీజేపీ వాస్తవంగా పోటీకి దూరంగా ఉంటుందా? లేక రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే వ్యూహమా? అనే అంశంపై ప్రజల్లో విస్తృత చర్చ సాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం కల్వకుర్తి జిల్లా ఏర్పాటుపై, అలాగే ఆమనగల్‌లో డివిజన్ కార్యాలయాల ఏర్పాటుపై స్పష్టత ఇస్తే బీజేపీకి రాజకీయంగా షాక్ ఇవ్వనుందా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. గత మున్సిపల్ ఎన్నికల్లో కల్వకుర్తి పురపాలక సంస్థలో బీఆర్‌ఎస్, ఆమనగల్ మున్సిపాలిటీలో బీజేపీ పాలకవర్గం ఏర్పడిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా, రంగారెడ్డి జిల్లా మాడుగుల మండల కేంద్రానికి చెందిన స్వర్గీయ సూదిని జైపాల్ రెడ్డి 84వ జయంతి వేడుకలు రేపు మాడుగులలో నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా కల్వకుర్తి నియోజకవర్గానికి చెందిన అఖిలపక్ష నేతలు ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డిని కలిసి, కల్వకుర్తిని జిల్లాగా ప్రకటించాలని, ఆమనగల్‌లో ప్రభుత్వ డివిజన్ కార్యాలయాలు ఏర్పాటు చేయాలని వినతిపత్రం అందజేయనున్నారు. ఈ భేటీపై సర్వత్రా రాజకీయ, ప్రజా వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
