సంక్రాంతి సంగీత విభావరిలో మంత్రముగ్ధులైన సంగీతప్రియులు

 సంక్రాంతి సంగీత విభావరిలో మంత్రముగ్ధులైన సంగీతప్రియులు

హిమాయత్‌నగర్‌లో ఘనంగా డి భారతి–ఆనంద లహరి సంబరాలు

హైదరాబాద్, జనవరి 10 (ఆంధ్రజ్యోతి): డి భారతి ఫౌండేషన్ మరియు ఆనంద లహరి కల్చరల్ ఈవెంట్స్ సంయుక్త ఆధ్వర్యంలో హిమాయత్‌నగర్‌లోని ఎలైడ్ ఆడిటోరియంలో శనివారం నిర్వహించిన సంక్రాంతి సంగీత విభావరి సంగీతప్రియులను మంత్రముగ్ధులను చేసింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కొనసాగిన ఈ కార్యక్రమం పండుగ వాతావరణాన్ని అద్భుతంగా ప్రతిబింబించింది. తెలుగు, హిందీ సినీ గీతాలతో గాయని, గాయకులు వేదికపై ఉర్రూతలూగిస్తూ ప్రేక్షకులను అలరించారు. ఈ కార్యక్రమంలో ఆనంద లహరి కల్చరల్ ఈవెంట్స్ అధినేత దేవేందర్ గౌడ్, విశ్వ సాహితి ఉమెన్ చైర్పర్సన్, సామాజికవేత్త అంజనీకుమారి ముఖ్య అతిథులుగా పాల్గొని గాయని, గాయకులతో కలిసి సందడి చేశారు. ఈ సందర్భంగా అంజనీకుమారి మాట్లాడుతూ, గాయని, గాయకులు పాటలు పాడటమే కాకుండా సందర్భానుసారంగా, సమయపాలనతో కార్యక్రమాన్ని రూపకల్పన చేసుకోవడం అత్యంత అవసరమని అన్నారు. ఆ విషయంలో ఆనంది ఒక మంచి ఉదాహరణగా నిలిచారని, ఆమె కృషి, పట్టుదల ఈ కార్యక్రమానికి ప్రత్యేక వన్నె తీసుకొచ్చాయని ప్రశంసించారు. ఒక ఆర్గనైజర్ కార్యక్రమాన్ని ఎలా డిజైన్ చేస్తాడన్నదానిపైనే మొత్తం ప్రోగ్రామ్ విజయం ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. ఇలాంటి వేదికలు అరుదుగా లభిస్తాయని, గాయని–గాయకులు పాటల ఎంపిక నుంచి వేదికపై ప్రవర్తన వరకు ప్రతి అంశంపైనా ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. సంక్రాంతి పండుగ వాతావరణాన్ని ఉత్సాహంగా కొనసాగించడంలో ఆనంది పాత్ర కీలకమని తెలిపారు. అలాగే మంచి స్నేహానికి మారుపేరుగా దేవేందర్ గౌడ్ నిలుస్తారని, ఆనంది, దేవేందర్ కలయిక వల్లే ఈ కార్యక్రమం ఇంత ఘనంగా జరిగిందని అభిప్రాయపడ్డారు. డి భారతి ఫౌండేషన్ అధినేత ఆనంద లక్ష్మి ఈ సందర్భంగా గాయని–గాయకులను ప్రత్యేకంగా అభినందిస్తూ ఉత్సాహపరిచారు. కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించిన ది వేదుల మూర్తిగారు సభను చక్కగా నడిపారని, సౌండ్ సిస్టమ్ ట్రాక్ కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుందని నిర్వాహకులు తెలిపారు. ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు మరిన్ని జరగాలని ఆకాంక్షించారు. ఈ సంగీత విభావరిలో వర్ధమాన గాయని ఇందు నయన, వెంకట్ రాంగోపాల్, నాగరాజు, వాసు సుబ్బరామన్, ఎస్.ఎస్. రామన్, ఉపేందర్ నాని, సూర్యరాజు, రవికిషోర్, రవికుమార్, ఈ. శ్రీనివాస్, రమేష్, మధుకర్, మదన్ కుమార్, పూర్ణిమ, చంద్ర ప్రకాశ్, యామిని ప్రియా, శ్రావణి దుర్గా, జె. స్మిత, జితేంద్ర కుమార్, ఉపేంద్ర కృష్ణ బాల శాస్త్రి, వెంకట కుమార్, గురునాథ్, శ్రీనివాసరావు తదితరులు పాల్గొని తాము ఎంచుకున్న పాటలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. కార్యక్రమానికి హాజరైన అభిమానులు, ప్రేక్షకులు, అతిథులకు గాయని, గాయకులు హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఆనంది, దేవేందర్ గౌడ్‌లు ఇలాంటి కార్యక్రమాలను కొనసాగిస్తూ సంగీత రంగంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని అంజనీకుమారి ఆకాంక్షించారు. ఈ సందర్భంగా తమకు అవకాశం కల్పించిన నిర్వాహకులకు గాయని, గాయకులు ధన్యవాదాలు తెలిపారు.







Previous Post Next Post