అనధికార గైర్హాజరుపై కఠిన చర్యలు
ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంకు షోకాజ్ నోటీస్ జారీ
నాగర్ కర్నూల్, జనవరి 7 (మనఊరు ప్రతినిధి): జిల్లా కేంద్రంలోని సంజయ్ నగర్ పాఠశాల విధులకు అనధికారికంగా గైర్హాజరవుతూ విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సంజయ్ నగర్ ప్రాథమిక పాఠశాల ఎల్ఎఫ్ఎల్ హెడ్‌మాస్టర్ శేఖర్‌కు షోకాజ్ నోటీస్ జారీ చేయాలని నాగర్ కర్నూల్ మండల విద్యాశాఖాధికారి భాస్కర్ రెడ్డిని జిల్లా విద్యాశాఖ అధికారి ఏ. రమేష్ కుమార్ ఆదేశించారు. గత రెండు నెలల క్రితం డీఈవో పాఠశాలను తనిఖీ చేసిన సందర్భంగా హెచ్‌ఎం గైర్హాజరు అంశంపై ఇప్పటికే మెమో జారీ చేసిన విషయం తెలిసిందే. బుధవారం మరోసారి ఆకస్మిక తనిఖీ నిర్వహించిన డీఈవో, ఈసారి కూడా హెడ్‌మాస్టర్ శేఖర్ అనధికారికంగా గైర్హాజరైనట్లు గుర్తించారు. స్పందించిన డీఈవో, సంబంధిత హెచ్‌ఎంకు షోకాజ్ నోటీస్ జారీ చేసి, రెండు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు. హెచ్‌ఎం ఇచ్చే వివరణ ఆధారంగా శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఎంఈఓ భాస్కర్ రెడ్డికి సూచించారు. ఈ సందర్భంగా డీఈవో ఏ. రమేష్ కుమార్ మాట్లాడుతూ పాఠశాల విధుల్లో ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పాఠశాలలో విద్యార్థుల హాజరు, ఉపాధ్యాయుల ముఖ హాజరు వివరాలను డీఈవో పరిశీలించారు.
