విజయవంతమైన కంటి చికిత్స శిబిరం
క్యాటరాక్ట్ శస్త్రచికిత్సకు 38 మందిని రిఫర్ చేసిన డాక్టర్లు
నాగర్ కర్నూల్, జనవరి 30 (మనఊరు ప్రతినిధి): జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం నాడు నాగర్ కర్నూల్ పాత కలెక్టరేట్ భవనం 102వ గదిలో నిర్వహించిన కంటి చికిత్స శిబిరం విజయవంతంగా ముగిసినట్లు జిల్లా ఆప్తాలమిక్ అధికారి కొట్ర బాలాజీ తెలిపారు. ఈ శిబిరానికి జిల్లా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 86 మంది రోగులకు కంటి పరీక్షలు నిర్వహించగా, అందులో క్యాటరాక్ట్ సమస్యతో బాధపడుతున్న 38 మందిని అర్హులుగా గుర్తించారు. వారిని ప్రత్యేక అంబులెన్స్ ద్వారా లయన్ రాంరెడ్డి కంటి ఆసుపత్రికి శస్త్రచికిత్స నిమిత్తం తరలించినట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య సిబ్బంది వై. శ్రీనివాసులు, సుకుమార్ రెడ్డి, నరసింహ, చెన్నకేశవులు, ప్రకాష్, సురేష్, డి.ఎల్. చారి, సురేష్ చారి తదితరులు పాల్గొని సేవలందించారు. ప్రజలకు ఉచితంగా మెరుగైన కంటి వైద్యం అందించడమే లక్ష్యంగా ఇలాంటి శిబిరాలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు.
