ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి
– ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
మహబూబ్‌నగర్, జనవరి 1 (మనఊరు ప్రతినిధి): ప్రజలు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి సూచించారు. శంకర్ కంటి ఆసుపత్రి, మోహ్సిన్ ఏ అజామ్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 4న అల్మాస్ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించనున్న ఉచిత కంటి పరీక్షలు, ముత్యబిందు (కంటి శుక్లాలు) ఉచిత ఆపరేషన్ శిబిరానికి సంబంధించిన గోడపత్రికను ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు ఎంతో ఉపయోగకరమైన ఈ తరహా సేవా కార్యక్రమాలు అభినందనీయమన్నారు. పేద, మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో మోహ్సిన్ ఏ అజామ్ ఫౌండేషన్, శంకర్ కంటి ఆసుపత్రి సంయుక్తంగా ఈ శిబిరాన్ని నిర్వహించడం సంతోషకరమని పేర్కొన్నారు. అవసరమైనవారు పెద్ద సంఖ్యలో హాజరై కంటి పరీక్షలు చేయించుకుని ఉచిత వైద్య సేవలు పొందాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మహబూబ్‌నగర్ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు సాదుల్లా, మోహ్సిన్ ఏ అజామ్ ఫౌండేషన్ అధ్యక్షులు అబ్దుల్ రెహమాన్, ఉపాధ్యక్షులు మహ్మద్ మునీర్, సాజిద్, అబ్దుల్ నయీమ్ తదితరులు పాల్గొన్నారు.
