జహంగీర్ పీర్ దర్గా ఒక పవిత్ర పుణ్యక్షేత్రం
టాలీవుడ్ నటుడు అలీ
కొత్తూరు, జనవరి 1 (మనఊరు ప్రతినిధి): కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ సందర్శించే పవిత్ర పుణ్యక్షేత్రం జహంగీర్ పీర్ దర్గా అని ప్రముఖ టాలీవుడ్ సినీ నటుడు అలీ అన్నారు. దర్గాలో నిర్వహిస్తున్న ఫతేహా ఉత్సవాలను పురస్కరించుకొని గురువారం ఆయన దర్గాను సందర్శించారు. సతీ సమేతంగా దర్గాకు వచ్చిన అలీ దట్టీలు కప్పి ముస్లిం పండితుల ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో పలుమార్లు జహంగీర్ పీర్ దర్గాను సందర్శించానని, ఇక్కడికి వచ్చిన ప్రతీసారి మనసుకు ఎంతో ప్రశాంతత లభిస్తుందని తెలిపారు. భక్తుల కోర్కెలు తప్పకుండా నెరవేరుతాయనే విశ్వాసం తనకు ఉందన్నారు. జనవరి 15వ తేదీ నుంచి ప్రారంభం కానున్న జహంగీర్ పీర్ దర్గా ఉర్సు ఉత్సవాలలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఆయన కోరారు. దర్గాలో జరిగే కార్యక్రమాలను నిర్వాహకులు ఎంతో సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని ప్రశంసించారు. ఈ సందర్భంగా దర్గా నిర్వాహకులు సినీ నటుడు అలీకి ఘన స్వాగతం పలికారు. ఉత్సవాలలో పాల్గొన్న అలీ పండితుల ఆశీస్సులు తీసుకొని దర్గా సేవాకార్యక్రమాలను తిలకించారు.


