పదిమంది అవినీతిపరులను ఓడించండి…
ఐదుగురు ప్రశ్నించే గొంతుకులను గెలిపించండి
మున్సిపాలిటీ ప్రక్షాళనకు అఖిలపక్ష ఐక్యవేదిక పిలుపు
అవినీతి అంతానికి ఏ త్యాగానికైనా సిద్ధం
డాక్టర్ సతీష్ యాదవ్
ప్రజల పక్షాన పోరాటమే లక్ష్యం
అఖిలపక్ష ఐక్యవేదిక
వనపర్తి, (మనఊరు ప్రతినిధి): మున్సిపాలిటీలో నెలకొన్న అవినీతిని పూర్తిగా అంతం చేయడమే లక్ష్యంగా అఖిలపక్ష ఐక్యవేదిక ముందుకు సాగుతోందని ఆ వేదిక అధ్యక్షుడు డా. సతీష్ యాదవ్ తెలిపారు. “పదిమంది అవినీతిపరులను ఓడించండి… ఐదుగురు ప్రశ్నించే గొంతుకులను గెలిపించండి” అంటూ ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా శనివారం 28వ వార్డు, 5వ వార్డు, 13వ వార్డులను సందర్శించిన అనంతరం డా. సతీష్ యాదవ్ మాట్లాడుతూ, అనువైన చోట అఖిలపక్ష ఐక్యవేదిక తరఫున అభ్యర్థులు పోటీ చేస్తారని స్పష్టం చేశారు. మున్సిపాలిటీలో అవినీతిని నిర్మూలించేందుకు అవసరమైతే ఏ త్యాగానికైనా సిద్ధమని ప్రకటించారు. ఒక ప్రశ్నించే గొంతుక మాట్లాడితే అవినీతిపరులు బెదిరింపులు, దాడులకు కూడా దిగుతారని పేర్కొన్నారు. అయినా సరే, పుట్టిన ఊరికి సేవ చేయాలనే సంకల్పంతో తాను ఏ త్యాగానికైనా సిద్ధమని చెప్పారు. చెప్పిన మాట నెరవేరితే చాలని, ప్రజల నమ్మకమే తమ బలమని ఆయన అన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అనంతరం నామినేషన్లు వేసే అభ్యర్థులను బట్టి తుది నిర్ణయాలు వెల్లడిస్తామని తెలిపారు. అంతవరకు ప్రజలతో మమేకమై వనపర్తికి ఎవరు మేలు చేశారు, ఎవరు కీడు చేశారు, ఎవరు దోచుకున్నారో తగిన సాక్షాలతో ప్రజల ముందుకు తీసుకువస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర్లు, బత్తిని మధు, రామస్వామి, నాగరాజు, రమేష్, జక్కుల రాములు, వెంకటస్వామి, రమేష్ నాయక్, మన్యం నాయక్, రాములు నాయక్ తదితరులు పాల్గొన్నారు.

