తాండలకు రవాణా సౌకర్యం!
పెద్ద గుండ్ల తాండ
మర్ల బావి తాండ మధ్య మట్టి రోడ్డు పనులు ప్రారంభం
మిడ్జిల్, జనవరి 24 (మనఊరు ప్రతినిధి): మండలంలోని పెద్ద గుండ్ల తాండ గేటు నుంచి పెద్ద గుండ్ల తాండ, ఎర్రగుంట తాండ మీదుగా మర్ల బావి తాండ వరకు మట్టి రోడ్డు నిర్మాణ పనులు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమాన్ని సర్పంచ్ మెగావత్ రాజు నాయక్, ఉపసర్పంచ్ శ్రీను నాయక్, వార్డు మెంబర్ రాజశేఖర్, మాజీ వార్డు మెంబర్ శంకర్ నాయక్ కలిసి ప్రారంభించారు. రోడ్డు పనులు పూర్తవడం ద్వారా స్థానిక ప్రజలకు రాకపోకలు మరింత సులభతరం కానున్నాయని, తాండల మధ్య వాణిజ్య లావాదేవీలు పెరగనున్నాయని నాయకులు తెలిపారు. గ్రామీణ ప్రాంత ప్రజల నిత్యజీవితంలో ఈ రోడ్డు కీలకమైన సౌకర్యంగా మారనుందని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ రాజు నాయక్, ఉపసర్పంచ్ శ్రీను నాయక్ లు మాట్లాడుతూ తాండవాసులు అందరూ సహకరించి రోడ్డు పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలని కోరారు. గత పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో తాండల అభివృద్ధి నిర్లక్ష్యం పాలైందని విమర్శించారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు అల్వాల్ రెడ్డి సహకారంతో మరిన్ని అభివృద్ధి పనులు మంజూరు చేయించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. రోడ్డు పనులు ప్రారంభం కావడంతో తాండ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.


