నిజాయితీపరులను గెలిపించి అవినీతిపరులను ఓడించాలి
మున్సిపల్ ఎన్నికలపై అఖిలపక్ష ఐక్యవేదిక పిలుపు
వనపర్తి, జనవరి 9 (మనఊరు ప్రతినిధి): రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల భవిష్యత్తును నిర్ణయించేది ఆలోచనతో కూడిన ఓటేనని అఖిలపక్ష ఐక్యవేదిక వనపర్తి జిల్లా అధ్యక్షుడు, మాజీ కౌన్సిలర్ డాక్టర్ సతీష్ యాదవ్ అన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ, పార్టీ భేదాలు పక్కన పెట్టి నిజాయితీ గల అభ్యర్థులను ఎన్నుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వనపర్తి జిల్లాలోని పట్టణాలు మూడో తరగతి మున్సిపాలిటీలుగా ఉండగా, పాలకుల అసమర్థత కారణంగా మొదటి తరగతి మున్సిపాలిటీ పన్నులు ప్రజలపై మోపుతున్నారని విమర్శించారు. ఇంటి పన్నులు, నీటి పన్నులు పెంచడమే కాకుండా లేని పన్నులు విధించారని ఆరోపించారు. ఎన్నికల అనంతరం కొందరు ప్రజలు ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేసి అవినీతికి పాల్పడుతూ పట్టణాల అభివృద్ధిని దెబ్బతీస్తున్నారని అన్నారు. పాత బస్టాండ్, తాళ్ళచెరువు ఆక్రమణలు, మున్సిపల్ కాంట్రాక్టులలో అక్రమాలు, ప్రభుత్వ ఆస్తుల విక్రయం, అక్రమ కట్టడాలు, చిరు వ్యాపారులపై వసూళ్లు వంటి అంశాలపై ఆధారాలతో ప్రజల ముందుకు తీసుకొస్తామని తెలిపారు. ప్రజలను మభ్యపెట్టే తాత్కాలిక ప్రచారాలకు మోసపోవద్దని సూచించారు. అవినీతిపరులను ఓడించడమే తమ లక్ష్యమని, త్వరలో అవినీతిపరుల వివరాలను వార్డు వారీగా ప్రజలకు తెలియజేస్తామని వెల్లడించారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో అఖిలపక్ష ఐక్యవేదిక కమిటీలను తాత్కాలికంగా రద్దు చేస్తున్నామని, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల అనంతరం కొత్త కమిటీలను ఏర్పాటు చేస్తామని తెలిపారు.
