భక్తిశ్రద్ధల మధ్య చెన్నకేశవస్వామి కళ్యాణం
రథసప్తమితో గ్రామ ప్రజలతో కళకళలాడిన దేవాలయం
కల్వకుర్తి రూరల్, జనవరి 25 (మనఊరు ప్రతినిధి): మండలంలోని తాండ్ర గ్రామంలో రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం శ్రీ చెన్నకేశవస్వామి దేవాలయంలో శ్రీ శ్రీ శ్రీ లక్ష్మీ చెన్నకేశవస్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. స్వామివారి కళ్యాణ కార్యక్రమాన్ని వేముల గోకారి–యాదమ్మ, ఎన్నమళ్ల వెంకటయ్య–పావణి, తడాక్ శేఖర్–వెన్నెల, కేతమళ్ల సురేందర్–మమత దంపతులు భక్తిపూర్వకంగా నిర్వహించారు. అనంతరం గ్రామ సర్పంచ్ కాయితి ఆశదీప్ రెడ్డి ఆధ్వర్యంలో భక్తులకు అన్నప్రసాద పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సాయంత్రం స్వామివారి ఊరేగింపు భజన బృందాల కీర్తనలతో పాటు గ్రామ ప్రజల ఉత్సాహభరిత పాల్గొనడంతో భక్తి వాతావరణంలో సాగింది. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారి దర్శనం చేసుకుని పుణ్యఫలాలు పొందారు.
