పన్నుల వసూలే పునాది…
మున్సిపాలిటీల అభివృద్ధికి ముసురు!
నాగర్‌కర్నూల్ జిల్లాలో రూ.20 కోట్లకు గాను రూ.7.57 కోట్లే వసూలు
నాగర్‌కర్నూల్, జనవరి 29 (మనఊరు ప్రతినిధి): మున్సిపాలిటీల అభివృద్ధికి ప్రధాన ఆధారంగా ఉండే పన్నుల వసూలు నాగర్‌కర్నూల్ జిల్లాలోని మున్సిపాలిటీల్లో మం దకొడిగా కొనసాగుతోంది. జిల్లాలో ఉన్న నాలుగు మున్సిపాలిటీల్లో ఇప్పటి వరకు పన్నుల వసూళ్లు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో అభివృద్ధి పనులు ప్రశ్నార్థకంగా మారుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా నాలుగు మున్సిపాలిటీల్లో కలిపి రూ.20.22 కోట్ల మేర పన్నుల ఆదాయం రావాల్సి ఉండగా, ఇప్పటి వరకు కేవలం రూ.7.57 కోట్లను మాత్రమే అధికారులు వసూలు చేయగలిగారు. అయితే మార్చి 31 వరకు గడువు ఉండటంతో మిగిలిన మొత్తాన్ని ఎలా వసూలు చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. పన్నుల వసూళ్లలో కల్వకుర్తి మున్సిపాలిటీ తీవ్రంగా వెనుకబడి ఉండగా, మిగతా మూడు మున్సిపాలిటీల్లో మాత్రం కొంత మేర మెరుగైన వసూలు నమోదైంది. అచ్చంపేట మున్సిపాలిటీలో రూ.4.02 కోట్ల పన్నులు రావాల్సి ఉండగా ఇప్పటి వరకు రూ.1.87 కోట్లు (46 శాతం) వసూలు చేశారు. కొల్లాపూర్‌లో రూ.1.30 కోట్ల లక్ష్యానికి గాను రూ.56 లక్షలు (43 శాతం) వసూలయ్యాయి. నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీలో రూ.6.97 కోట్లకు గాను రూ.2.98 కోట్లు (42 శాతం) వసూలు చేయడం జరిగింది. కల్వకుర్తి మున్సిపాలిటీలో మాత్రం రూ.7.93 కోట్ల లక్ష్యానికి గాను కేవలం రూ.2.16 కోట్లు (27.29 శాతం) మాత్రమే వసూలవడం గమనార్హం. మార్చి 31 నాటికి వందశాతం పన్నుల వసూలే లక్ష్యంగా మున్సిపల్ కమిషనర్లు ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నప్పటికీ, ప్రస్తుతం రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుండటంతో వసూళ్లపై పూర్తి స్థాయిలో దృష్టి సారించలేకపోతున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతేడాది ఈ సమయానికి పన్నుల వసూలు కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన అధికారులు, ఈసారి అలాంటి చర్యలు చేపట్టకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. మరో రెండు మూడు రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుండగా, ఎన్నికల ప్రక్రియ పూర్తయిన అనంతరం పన్నుల వసూలుపై పూర్తిస్థాయిలో చర్యలు తీసుకునే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.
