అనంతసాగరలో ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు రాగి జావ కప్పుల పంపిణీ
చింతకాని, జనవరి 27 (మనఊరు ప్రతినిధి): మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల అనంతసాగరలో మాస్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం విద్యార్థులకు పోషకాహార అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థినీ–విద్యార్థులకు రాగి జావ త్రాగుటకు గాను 55 కప్పులను మాస్ స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ డాక్టర్ పత్తిపాటి లక్ష్మికాంతమ్మ పంపిణీ చేశారు. అనంతరం డాక్టర్ లక్ష్మికాంతమ్మ చిన్నారులకు బాల్యం నుంచే ఎలా ఉండాలి, చదువుతో పాటు ఆరోగ్యం ప్రాముఖ్యత, మంచి అలవాట్లు, క్రమశిక్షణ వంటి అంశాలపై సులభంగా అవగాహన కల్పించారు. విద్యార్థులను ప్రోత్సహిస్తూ భవిష్యత్తులో కూడా ఇలాంటి మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఈ సేవా కార్యక్రమాన్ని పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి. భిక్షం, ఉపాధ్యాయులు ఎస్‌కే సోనిమియా, పూర్ణచందర్ రావు, విద్యార్థులు, మాస్ స్వచ్ఛంద సంస్థ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.













