భక్తి శ్రద్ధలతో పాల్గొన్న శివదీక్ష స్వాములు...
నాగర్‌కర్నూల్‌లో ఘనంగా శివస్వాముల మహా పడిపూజ
నాగర్‌కర్నూల్, జనవరి 27 (మనఊరు ప్రతినిధి): పట్టణంలోని రూబీ గార్డెన్ సమీపంలో గల గురుస్వామి బోజ్జన్న నివాసంలో మంగళవారం శివస్వాముల మహా పడిపూజ కార్యక్రమం శాస్త్రోక్తంగా, వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని గురుస్వామి పలుస విజయ్ కుమార్ స్వామి ఆధ్వర్యంలో ఘనంగా చేపట్టారు. పూజా కార్యక్రమంలో పాల్గొన్న శివస్వాములు శివనామ స్మరణ చేస్తూ భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. శివలింగానికి పంచామృత, బిల్వపత్రాలు, భస్మం, పుష్పాలతో అభిషేకాలు చేసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. శివనామస్మరణతో పరిసరాలు మారుమోగగా, అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ మహా పడిపూజ కార్యక్రమంలో శివ దీక్షాస్వాములు, గురుస్వాములు, భక్తులు, కాలనీవాసులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.


